వ్యక్తి జీవితం పుట్టుకతో నిర్దేశితం కాదు. ఆ వ్యక్తి అనుభవాలు, సంక్షోభాలు, వాటిని ఎదుర్కొనే సత్తా, సంవేదనలు, సంతోషాలు వీటన్నిటి ఆధారంగా ఆ జీవితం నిర్మితమవుతుంది. మనం చేసిన కర్మలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి ‘దాబా హోటల్’ నవలే సాక్ష్యం. లంబాడీ తండాలో పుట్టిన బిచ్చం బాల్యంలోనే తల్లిని కోల్పోయాడు.
శ్రమజీవి విజయగాథ
వ్యక్తి జీవితం పుట్టుకతో నిర్దేశితం కాదు. ఆ వ్యక్తి అనుభవాలు, సంక్షోభాలు, వాటిని ఎదుర్కొనే సత్తా, సంవేదనలు, సంతోషాలు వీటన్నిటి ఆధారంగా ఆ జీవితం నిర్మితమవుతుంది. మనం చేసిన కర్మలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి ‘దాబా హోటల్’ నవలే సాక్ష్యం. లంబాడీ తండాలో పుట్టిన బిచ్చం బాల్యంలోనే తల్లిని కోల్పోయాడు. సవితి తల్లి పోరు తట్టుకోలేక చిన్నతనంలోనే ఎన్నో కష్టాలను అనుభవిస్తాడు. చేయని తప్పును తనపై మోపినప్పుడు.. దాన్నుంచి తప్పించుకునేందుకు లారీ డ్రైవర్ అయిన దిల్బాగ్ సింగ్‌ను ఆశ్రయిస్తాడు బిచ్చం. ఆ కుర్రాడి ఆవేదనను అర్థం చేసుకున్న ఆ సింగ్ గురుద్వారా తీసుకెళ్లి ఆకలి అని వచ్చిన వారికి కడుపునింపే బాధ్యతను అప్పగిస్తాడు.
గురుద్వారాలో సేవలు పొందుతున్న బిచ్చం సిక్కు మతానికి ఆకర్షితుడై ఆ ధర్మాన్ని స్వీకరించి హరిభజన్ సింగ్‌గా మారుతాడు. వివిధ ప్రాంతాలను గురుద్వారాలో సేవలు చేసి హరిభజన్ సింగ్ తిరిగి లంబాడి యువతి దుర్గాబాయిని వివాహం చేసుకుంటాడు. భర్త నమ్మిన ధర్మాన్నే తాను అనుసరిస్తానని ఆమె కూడా సిక్కు మతాన్ని స్వీకరించి రంజిత్ కౌర్‌గా పేరు మార్చుకొని భర్తతో కలిసి గురుద్వారాలో సేవలు చేస్తూ ఉంటుంది.
ఈ తరుణంలోనే భవిష్యత్తు గురించి భార్య చేసిన ఆలోచనతో ఏకీభవించి తన చిన్నాయనల సహాయంతో పాల్వంచలో మొట్టమొదటిసారి దాబా హోటల్ పెడతాడు హరిభజన్. హోటల్ నిర్వహణలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటాడు. తన పిల్లలను గొప్పగా చదివించడం కోసం హరిభజన్ సింగ్ దంపతులు పడ్డ కష్టానికి విలువ కట్టలేము. ఆ విలువకు ప్రతిరూపంగా బిడ్డలు ప్రయోజకులైన తీరు ఆసాంతం ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా తన చేతికింద పనిచేసిన బంధువులు కొత్తగా హోటల్ పెట్టుకునేందుకు ఆ దంపతులు సహకరించి తమలోని ఉపకార గుణాన్ని చాటుకుంటారు. వెలిగే దీపమేభై దీపాలకు వెలిగిస్తుందన్నట్టుగా హరిభజన్’ ప్రోత్సాహంతో ఆ ప్రాంతంలో నల దాబా హోటళ్లు ఏర్పాటవుతాయి. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు తన రెక్కల కష్టంమీద ఆధారపడిన హరిభజన్సింగ్ మనందరికి రియల్ హీరోగా కనిపించాడు. ఇది కేవలం ఒక వ్యక్తిగత విజయగాథ మాత్రమే కాదు.. సమాజ పరివర్తన గాథ కూడా!
దాబా హోటల్ (నవల)
రచయిత: శిరంశెట్టి కాంతారావు
పేజీలు: 153, ధర: రూ.150
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
-రాజు పిల్లనగోయిన
సెల్ నానీలు
రచన : చలపాక ప్రకాశ్
పేజీలు : 56; ధర : రూ.50
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 92474 75975
దిగులు వర్ణం
రచన : రోహిణి వంజారి
పేజీలు : 120;
ధర: రూ.200
ప్రచురణ: ఆదర్శిని మీడియా
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 90005 94630

