– ప్రకటన –
ఫొటోలు మార్ఫింగ్ చేసి రూ.6.70 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
బాధితురాలికి పోలీసుల అంద ఖాతాల్లో రూ.3.20 లక్షలు హోల్డ్ చేయించిన వైనం
నవతెలంగాణ- బూర్గంపాడు
సులభంగా రుణం ఇప్పిస్తామంటూ నమ్మించి, వ్యక్తిగత వివరాలు సేకరించి ఓ మహిళ నుంచి లక్షలాది రూపాయలు కాజేసిన సైబర్ మోసం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాబు మండల పరిధిలోని గౌతాపురం కాలనీకి చెందిన ఓ మహిళకు ఇటీవల గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తక్కువ వడ్డీకే లోన్ ఇప్పిస్తామని నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు, ఆమె నుంచి ఆధార్, పాన్ కార్డుతో పాటు ఇతర వ్యక్తిగత వివరాలను సేకరించారు. ఆ తర్వాత అసలు స్కెచ్ అమలు చేయబడింది. సేకరించిన సమాచారంతో సదరు మహిళ ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, వాట్సాప్‌లో ఆమెకే పంపారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. సైబర్ నేరగాళ్ల బెదిరింపులతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు, సమాజంలో పరువు పోతుందనే భయంతో విడుతల వారిగా మొత్తం రూ.6.70 లక్షలు వారి ఖాతాల్లోకి వేసింది. బాధితురాలు వద్ద ఇంకా డబ్బులు లాగేందుకు నేరగాళ్లు ఒత్తిడి పెంచడంతో, ఇక తట్టుకోలేక ఆమె బూర్గంపాడు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో వెంటనే స్పందించిన బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ క్రైమ్ విభాగం సహాయంతో నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలను సేకరించి, ట్రాన్సాక్షన్లను తక్షణమే నిలిపివేశారు. దీంతో సైబర్ మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిన మొత్తం సొమ్ములో రూ.3.20 లక్షలను హోల్డ్ చేయడంలో పోలీసులు సఫలమయ్యారు. నిందితుల ఆచూకీ అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశామని, త్వరలోనే నేరగాళ్లను అరెస్టు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. తక్కువ వడ్డీకి రుణాలంటూ అపరిచితులు చేసే ఫోన్ కాల్స్, మెసేజ్‌లను అస్సలు నమ్మవద్దని, మీ ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని ఎస్ఐ చెప్పారు. ఒకవేళ ఆన్లైన్ మోసాలు, ఫొటో మార్ఫింగ్ లేదా సైబర్ బెదిరింపులకు గురికాకుండా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 లేదా www.cybercrime. gov.in వైబ్‌సైట్ ద్వారా కంప్లైంట్ నమోదు చేయాలని ఎస్ఐ తెలిపారు.
– ప్రకటన –

