ఆంధ్రప్రదేశ్: జనసేన పార్టీలో చేరికలు పెద్దగా లేకపోవడానికి కారణాలేంటి? ఇటీవల చేరికలకు జనసేనాని పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ నేతలు జనసేనలో చేరేందుకు ముందుకు రాకపోవడానికి కారణమేంటి? లోపం ఎక్కడుంది? పార్టీ నిర్మాణం లేదా? టీడీపీ తోక పార్టీగా మారిపోయిందన్న కారణమా? లేక జనసేనలోకి వెళితే అతనికి రాజకీయ భవిష్యత్ ఉండదన్న అనుమానమా? అన్న సందేహాలు అనేక మందిలో వ్యక్తమవుతున్నాయి. జనసేనలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే పోలోమంటూ నేతలు వచ్చేయాలి. ఎందుకంటే ఏపీలో కూటమి బలంగా ఉందని, బలమైన సామాజికవర్గం అండగా ఉంటుందని భావించి జనసేన కండువా కప్పుకోవడానికి క్యూ కట్టాల్సి ఉంది.
కానీ జనసేనలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ను పవన్ కల్యాణ్ ఇచ్చి రోజులవుతున్నప్పటికీ చేరికలు లేకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతుంది. జనసేన లో వన్ మ్యాన్ షో అని చేరకపోవడానికి కారణం కాదు. ఎందుకంటే తెలుగుదేశం, వైసీపీ కూడా అందుకు భిన్నం కాదు. టీడీపీ, వైసీపీ కూడా వన్ మ్యాన్ షోగానే నడుస్తుంది. ప్రాంతీయ పార్టీలో ఎక్కడైనా అధినేతల నిర్ణయాలే ఫైనల్ గా ఉంటాయి. కారణం మాత్రం అది కాదంటున్నారు. జనసేన నేత పవన్ కల్యాణ్ మాటలు మారుస్తూ తరచూ నిర్ణయాలను ఛేంజ్ చేసుకోవడంతోనే నేతలు చేరడానికి కొంత వెనకంజ వేస్తున్నారని అంటున్నారు. ఆయన ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారనేది చివరి క్షణం వరకూ నేతలకు కూడా తెలియదు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారని అనేక మంది సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు.
ఇక జనసేనలో చేరినా అక్కడ టీడీపీ పెత్తనమే నడుస్తుందన్న భావన ఎక్కువగా నేతల్లో ఉంది. 2024 ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఆ నియోజకవర్గాల్లో కేవలం ఉత్సవ విగ్రహాలుగానే ఉన్నారు. టీడీపీలో ఛార్జుల పెత్తనమే ఎక్కువ నడుస్తుంది. ఏదైనా ఎదురు తిరిగితే అది అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఈ అంశాలను జనసేన అధినేత దృష్టికి తీసుకువెళ్లినా పెద్దగా ప్రయోజనం లేదని, ఆయన సమన్వయ సమావేశంలో మాట్లాడదామని, దాని వల్ల ఉపయోగం లేదని ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో అత్యధిక మంది అభిప్రాయం. ఈ విషయం ఇతర పార్టీల నేతలకు కూడా చేరడంతోనే పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. జనసేనాని నేతల్లో ఉన్న ఈ దురభిప్రాయాన్ని పోగొట్టగలిగితేనే చేరికలు ఊపందుకుంటాయి.

