ఆంధ్ర ప్రదేశ్ : వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్: వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో భారతి రెడ్డిని రాజకీయాల్లోకి తేవాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. భారతి రెడ్డిని వచ్చే ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో జగన్ ఉన్నారని తెలిసింది. మిగిలిన పార్టీల్లోనూ కుటుంబ సభ్యులు రాజకీయంగా చేదోడు వాదోడుగా ముఖ్యమంత్రులకు ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు లోకేశ్, బీఆర్ఎస్ లో కేటీఆర్, జనసేనలో పవన్ కు తోడుగా నాగబాబు వంటి వారు అండగా ఉన్నారు. రక్త సంబంధీకులు ఉంటే తాను ఇతర పనుల్లో ఉన్నా మిగిలిన పార్టీ పనులను చక్కబెట్టుకునే అవకాశం ఉంటుంది. జగన్ కు ఇప్పటి వరకూ ఆ ఛాన్స్ లేదు. వైవీ సుబ్బారెడ్డి వంటి వారున్నా వారు దూరపు బంధువులే. దగ్గరి బంధువులు కాదు.
రక్తసంబంధీకులు లేక…
మరొకవైపు తనకు శత్రువుగా చెల్లెలు షర్మిల కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నారు. తల్లి విజయమ్మ కూడా తనతో అంటీ ముట్టనట్లు ఉన్నారు. ఒకరకంగా జగన్ కు వ్యతిరేకంగానే ఈ రెండేళ్ల కాలం నుంచి విజయమ్మ వ్యవహరించారు. అందుకే పార్టీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి వైఎస్ విజయమ్మను జగన్ తప్పించారు. దీనితో తన రాజకీయ వారసత్వంతో పాటు తనకు పొలిటికల్ గా మరింత అండగా ఉండేందుకు భారతి రెడ్డిని పార్లమెంటు సభ్యురాలిగా పోటీ చేయించి కొంత బరువు తగ్గించుకోవాలని చూస్తున్నారు. దీనితో తనపై ఇప్పటి వరకూ కోటరీ ముద్ర కూడా తొలగిపోతుంది. తన తర్వాత ఖచ్చితంగా భారతి రెడ్డి రెండో స్థానంలో ఉంటారు. నెంబరు 2 స్థానం కోసం ఇక వైసీపీలో ఎవరూ పార్టీలో పాకులాడే పరిస్థితి ఉండదన్న అభిప్రాయంలో కూడా జగన్ ఉన్నారు.
ఇప్పటి వరకూ గృహిణిగానే…
భారతిరెడ్డి ఇప్పటి వరకూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. జగన్ గెలుపు కోసం పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల సమయంలోనే ప్రచారాన్ని నిర్వహించడం మినహా ఆమె పక్క గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పారిశ్రామికవేత్తగా ఆమె అనేక వ్యాపారాలను చూస్తున్నా లోపాయికారీగా జగన్ కు తనకు తోచిన రాజకీయ సలహాలు ఇస్తుంటారని అంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల కడప పార్లమెంటు నుంచి భారతి రెడ్డిని పోటీ చేయిస్తారన్న అభిప్రాయం ఉంది.గత ఎన్నికల్లో కడప జిల్లాలో కేవలం మూడు స్థానాలకే వైసీపీ పరిమితమైంది. అందుకే ఈసారి భారతి రెడ్డిని బరిలోకి దింపితే పదికి పది స్థానాలను గెలుచుకునే వ్యూహాన్ని జగన్ రూపొందించారంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయన్నది తెలియదు కానీ, ఈ ప్రచారం మాత్రం పార్టీలో జోరుగా జరుగుతుంది.
వార్తల సారాంశం – వచ్చే లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భారతిరెడ్డిని పోటీకి దింపవచ్చని సమాచారం

