ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ (BMW) జర్మనీలోని తన పనిచేస్తున్న ఉద్యోగులలో దాదాపు సగం మందికి స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్ నిర్ణయించింది. 2027 చివరి నాటికి దాదాపు 8,000 ఉద్యోగాలను తగ్గించుకునే లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. జర్మనీలోని మొత్తం 85,000 మంది శాశ్వత ఉద్యోగులలో దాదాపు 40,000 మంది ఆఫీస్ లేదా డెస్క్ ఆధారిత ఉద్యోగులకు అక్టోబర్ నెల నుండి ఈ ఆఫర్లు అందించబడతాయి. అయితే ప్రొడక్షన్ లైన్ లేదా ప్లాంట్లలో నేరుగా పనిచేసే కార్మికులకు ఈ కోతల మినహాయింపు ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా బిఎమ్‌డబ్ల్యూలో సుమారు 1.54 లక్షల మంది పనిచేస్తుండగా, ఈ తగ్గింపు ప్రణాళికపై పాలకమండలి, వర్క్స్ కౌన్సిల్ మధ్య దాదాపు ఆరు వారాల పాటు చర్చలు జరిగాయి.
ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలపై తగ్గుతున్న లాభాలు, అమెరికా విధించిన సుంకాలు, ముఖ్యంగా చైనా నుండి వస్తున్న తీవ్రమైన పోటీ కారణంగా జర్మన్ కార్ల తయారీదారులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో నిర్వహణ ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగుల సంఖ్యను కుదించే మార్గాలను వెతుకుతున్నారు. ఇప్పటికే ప్రముఖ సంస్థ వోక్స్వ్యాగన్ తన 10 బ్రాండ్ల పరిధిలో ఏకంగా లక్ష ఉద్యోగాల కోతపై ఆలోచిస్తుండగా, మెర్సిడెస్ బెంజ్ కూడా స్వచ్ఛంద విరమణ సంస్థను అమలు చేస్తోంది.
ఇతర సంస్థలతో ప్రస్తుత పెట్రోల్, డీజిల్. ఎలక్ట్రిక్ వాహనాల రకాలను సమాంతరంగా కొనసాగిస్తూ బిఎమ్‌డబ్ల్యూ ఈ సంక్షోభాన్ని కొంతవరకు మెరుగ్గా తట్టుకోగలిగింది. అయినప్పటికీ, కంపెనీకి కీలకమైన చైనా మార్కెట్లో వ్యాపారం చాలా మందగించింది. అక్కడ తీవ్ర పోటీ, ఆర్థిక మందగమనం కారణంగా వాహనాల డెలివరీలు భారీగా పడిపోయాయి. గత ఏడాదితో ముగిసిన ఈ ఏడాది జూన్‌తో త్రైమాసికంలో చైనాలో బిఎమ్‌డబ్ల్యూ కార్ల విక్రయాలు 30 శాతం వరకు తగ్గాయి. దీంతో సంస్థ గత నెలలోనే ఊహించని విధంగా లాభాల హెచ్చరిక జారీ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే వ్యయాలను నియంత్రించుకుని, వ్యాపారాన్ని మళ్లీ లాభాల బాట పట్టేందుకు బిఎమ్‌డబ్ల్యూ పెద్ద ఎత్తున లేఆఫ్‌లు, స్వచ్ఛంద విరమణలను అమలు చేయడానికి సిద్ధమైంది.

