టాక్సిక్ పాజిటివిటీ.. ఎప్పుడూ సంతోషంగా ఉండటం మంచిదేనా?
జీవితం అన్నాక సంతోషాలు, ఇబ్బందులు, కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు బాధపడటం అందరూ చేసే పనే… కొందరుంటారు.. చుట్టూ ఉన్నవారు బాధపడితే.. ఏడిస్తే.. వారిని ఓదార్చాలనే ఆలోచనలతో “ఏడిస్తే ఏం ప్రయోజనం?”, “అంతా సర్దుకుంటుంది,” “ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచించు!”.. ఇలా చాలా మంది సలహాలు ఇస్తారు. ఈ మాటలు వినడానికి బానే ఉంటాయి. కానీ మనస్తత్వవేత్తలు మాత్రం ఇది సరికాదు అంటున్నారు. దీన్ని టాక్సిక్ పాజిటివిటీ అని పిలుస్తారట. ఇది చాలా ప్రమాదకరమైనదని చెబుతున్నారు. కష్టంలో ఉన్నప్పుడు పాజిటివిటీ మాటలను ఒక మెడిసిన్ లాగా వాడతారు. కానీ ఇది కాలక్రమేణా మనిషిని ఒంటరిగా చేస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
టాక్సిక్ పాజిటివిటీ అంటే..
సులభంగా చెప్పాలంటే టాక్సిక్ పాజిటివీటి అంటే మనిషిలో ఉండే నిజమైన ఫీలింగ్స్ ను అంగీకరించకుండా వాటిని దాచడానికి ప్రయత్నించడం.
ఈ రోజుల్లో, సోషల్ మీడియా కారణంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా “బలంగా ఉండాలి” అనే మనస్తత్వం వల్ల ప్రజలు తమ దుఃఖాన్ని, భయాన్ని లేదా వైఫల్యాన్ని వ్యక్తపరచడానికి సంకోచిస్తున్నారు. అలా వ్యక్తం చేయడం ఒక పెద్ద బలహీనత అని అనుకుంటారు. ఎప్పుడూ సంతోషంగా, బలంగా కనిపించాలంటే తీవ్రమైన ఒత్తిడిలో అపరాధ భావాన్ని మాత్రమే పెంచుతుంది.
ఎమోషన్స్ అణిచివేత ప్రమాదం..
మనిషిలో ఉండే నిజమైన , ప్రతికూల భావోద్వేగాలను దాచుకోవడం చాలా హానికరం అని మానసిక పరిశోధనలు కూడా స్పష్టంగా నిర్ధారిస్తున్నాయి. తమ ఎమోషన్స్ ను అణచిపెట్టడానికి ప్రయత్నించే వ్యక్తులు అకస్మాత్తుగా భయాందోళనలకు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందట.
మనిషి తన నెగిటివ్ ఎమోషన్స్ ను నిరంతరం అణచివేస్తే, వారి ఒత్తిడి వేగంగా పెరుగుతుందట. ఇది సంబంధాలపైనా, మానసిక ఆరోగ్యంపైనా ప్రత్యక్షంగా, చాలా ప్రతికూల ప్రభావం చూపుతుందట.
నిజమైన మానసిక బలం..
మనిషిలో ఉన్న ఎమోషన్స్ ను ఓపెన్ గా యాక్సెప్ట్ చేయడమే నిజమైన మానసిక బలం అని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. విచార భావనలు ఎప్పుడూ తప్పు కాదు. వాటిని అణచివేయకుండా అర్థం చేసుకుని స్వీకరించడమే మనిషిని మానసికంగా దృఢంగా చేస్తుంది.
నిజమైన మానసిక బలం అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండదు, మనుషులుగా మనం కొన్నిసార్లు కుంగిపోవడం సహజమని అంగీకరించడమే.
టాక్సిక్ పాజిటీవిటీ బయట పడటానికి సూచనలు..
విచారాన్ని బలహీనతగా భావించకూడదు..
ఎమోషన్స్ ను, అభిప్రాయాలను ఓపెన్ గా వ్యక్తపరచాలి, విచారాన్ని ఓటమిగా భావించకూడదు.
నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడటం..
కష్ట సమయాల్లో ఆన్లైన్లో ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడానికి బదులుగా, మీరు బాగా నమ్మే వ్యక్తులతో సమస్యలను నిష్కపటంగా పంచుకోవాలి. దీని వల్ల ఊరట లభిస్తుంది, భారం తగ్గినట్టు అవుతుంది.
సలహా ఇవ్వడానికి బదులుగా వినాలి..
మీ చుట్టూ ఎవరైనా విచారంగా ఉంటే, వారికి ఊరట ఇవ్వడానికి భరోసా మాటలు చెప్పడానికి బదులుగా వారి సమస్య ఏంటో మొదట ఓపికగా వినాలి. తమ భాదను వెంటే చాలామంది మానసికంగా కుదుటపడతారు, తిరిగి ధైర్యం కూడా తెచ్చుకుంటారు.
“సానుకూల ఆలోచన”తో అస్సలు మార్చలేని కొన్ని సంఘటనలు ఉంటాయి. అందువల్ల, విచారాన్ని పూర్తిగా కొట్టిపారేయడం సానుకూల మార్గం కాదు, అది ఆత్మవంచన. కాబట్టి ఎప్పుడూ అన్నిటికీ పాజిటివ్ గా ఉండాలని, పాజిటివ్ జరగలేదని బాధపడకూడదు.
*రూపశ్రీ.

