వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంబటి జుగుప్సాకరంగా దుర్భాషలాడిన వైనంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
ఆ నేపథ్యంలో అరెస్టై విడుదలైన అంబటి తీరు ఏ మాత్రం మారలేదు. హోం మంత్రి అనితకు సిగ్గు, శరం ఉంటే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కానీ, ఆమెకు సిగ్గు లేదని, ఆ పదవిని పట్టుకొని వేలాడుతూనే ఉంటుందని రాంబాబు చేసిన వివాదంపై దుమారం రేపుతోంది.
అయితే, మహిళా నేత, హోంమంత్రి అయిన అనితను అసభ్య పదజాలంతో దుర్భాషలాడిన అంబటి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ ఎస్సీ నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ కోరికనే తన సొంత నియోజకవర్గం సత్తెనపల్లి నగరం నడిబొడ్డులో అంబటి దిష్టిబొమ్మను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. కానీ, ఆయన మాత్రం తన తీరు మార్చుకోలేదు.
అనితను పరుష పదజాలంతో విమర్శించానని, కులం పేరుతో దూషించానని వస్తున్న ఆరోపణలను అంబటి పూర్తిగా ఖండించారు.
తన దిష్టిబొమ్మలు తగలబెడితే తనకు నష్టమేమీ లేదని, గడ్డి తగలబడటం తప్ప తన శరీరానికి ఏమీ కాదని అంబటి వెటకారంగా మాట్లాడారు. అయితే, ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు. ఒకవేళ తన వ్యాఖ్యల వల్ల మందకృష్ణ మాదిగ గారు బాధపడితే ఆయనకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు.
తాను చేయని వ్యాఖ్యలను ఆరోపిస్తున్నారని, రాజకీయంగా దెబ్బతీయాలని చూడటం ధర్మం కాదని హితవు పలికారు. హోంశాఖ మంత్రికి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తనపై, జగన్ పై అనిత అత్యంత దారుణంగా మాట్లాడారని గుర్తుచేశారు.

