అమెరికాలో మరో విషాదకర ఘటన తెలుగు కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. తెలంగాణకు చెందిన ఓ యువ విద్యార్థి తన స్నేహితుల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో తాను ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది.
నల్గొండ జిల్లాకు చెందిన అనురూప్ రెడ్డి కొడూరు (22) ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. మే 29న కలిసి టెక్సాస్, లూసియానా సరిహద్దులోని టోలెడో బెండ్ రిజర్వాయర్ కనిపించాడు.
ఈ సందర్భంగా నీటిలో ముగ్గురు స్నేహితులు ప్రమాదంలో చిక్కుకోవడంతో అనురూప్ వెంటనే వారిని రక్షించేందుకు దూకాడు. అద్భుత ధైర్యసాహసాలు చూపించి ముగ్గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు. కానీ అదే సమయంలో నీటి అడుగున ఉన్న ఫిషింగ్ వైర్ అతని కాళ్లకు చిక్కుకుంది.
బలమైన నీటి ప్రవాహం కారణంగా బయటపడలేకపోయిన అనురూప్ నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు గంటల తరబడి గాలింపు చేపట్టి చివరకు అతని మృతదేహాన్ని సుమారు 20 అడుగుల లోతులో గుర్తించారు.
అమెరికాలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల మరణ వార్తలు తరచూ వినిపిస్తున్న వేళ ఈ ఘటన మరింత బాధ కలిగిస్తోంది. ముగ్గురు స్నేహితుల ప్రాణాలు కాపాడి తన ప్రాణాన్ని త్యాగం చేసిన అనురూప్ ధైర్యం ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు, యూనివర్సిటీలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

