టోల్ ప్లాజాల వద్ద బైఠాయించిన రైతులు
పంజాబ్: అమెరికా వాణిజ్య ఒప్పందంపై పంజాబ్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం రైతులు రైతులు చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టగా వారిని ఢిల్లీ శివారులో పోలీసులు అడ్డుకున్నారు. అయినా రైతులు వెనక్కి తగ్గకుండా తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. ప్రతిపాదిత భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి (ఎఫ్‌టీఏ) వ్యతిరేకంగా ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్ కే ఎం ) అనుబంధ రైతులు బుధవారం పంజాబ్‌లోని పలు టోల్‌ప్లాజాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు. లూథిóయానా, బఠిండా, హోషియార్‌పుర్, అమృత్సర్ తదితర నగరాల టోల్‌ప్లాజాల వద్ద ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం భారత సమాజంలోని రైతులు, పాడి ఉత్పత్తిదారులు, కోళ్ల పరిశ్రమ నిర్వాహకులు, చిరు వ్యాపారులు తదితర వర్గాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. దేశంలోకి చౌకరకం సాగు దిగుమతులు పెరిగి, మన రైతుల రాబడులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే బలహీనంగా ఉన్న రైతుల ఆర్థిక పరిస్థితిని ఈ ఒప్పందం మరింత దిగజారుతుందని, కేంద్ర ప్రభుత్వం మొండిగా వెళితే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తుందని సమాచారం. రైతులకు హానికరంగా మారిన పంజాబ్ ప్రభుత్వ భూ సమీకరణ కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అమెరికా నుంచి దిగుమతులు పెరిగితే దేశీయ వ్యవసాయ ఉత్పత్తులు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ ఉత్పత్తులకు, రైతులకు నష్టం కలిగించే ఈ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు

