దేశంలో మరోమారు ఇంధన ధరలను భారీగా పెంచుతూ చమురు సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. లీటర్ పై దాదాపుగా రూ.3 మేర పెంచుతూ చమురు సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయం సోమవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చేసింది. అమెరికా, ఇరాన్ ల మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ నెలలోనే మూడు దఫాలుగా ఇంధన ధరలు పెరిగిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆదివారం రాత్రి కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు…నాలుగు సారి కూడా ఇంధన ధరలను పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. అనుకున్నదే తడవుగా పెట్రోల్ ధరను లీటర్ కు రూ.2.61 మేర పెంచిన కంపెనీలు.. డీజిల్ థరలను లీటర్ కు రూ.2.71 మేర పెంచాయి. ఫలితంగా నాలుగోసారి ఇంధన థరలు భారీగా పెరిగాయి.
ఒక్క నెలలోనే వరుసగా నాలుగు పర్యాయాలు ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. నాలుగో సారి సోమవారం ఉదయం నుంచి పెరిగిన థరల తర్వాత ఏపీలో పెట్రోల్ ధర రూ.117.19ను తాకగా… తెలంగాణలో ఈ థర రూ.115.58కి చేరుకుంది. వరుసబెట్టి చమురు ఇంధన థరలను పెంచుతున్న కారణంగా ఈ నెలలోనే పెట్రోల్ ధర లీటరుకు ఏకంగా రూ.6 నుంచి 7 దాకా పెరగగా… డీజిల్ ధర కూడా అంతే స్థాయిలో పెరిగిందని చెప్పక తప్పదు.
ఇదిలా ఉంటే… పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఆ విపత్కర పరిస్థితులను తట్టుకుని నిలబడే దిశగా పొదుపు చర్యలను కూడా ఆయన సూచించారు. ఈ ఇంధన ధరల పెరుగుదల ఇదేమీ చివరిది కాదని, సమీప భవిష్యత్తులోనే కొన్ని సార్లు పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

