అందనున్న విద్యుత్ సరఫరా, పంట నష్టపరిహారం
2.30 లక్షల ఆదివాసీ, గిరిజనులకు చేకూరనున్న లబ్ది
ఫలించిన తెలంగాణ రైతు కమీషన్ కృషి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న భూములు భూభారతిలో కనిపించేలా మాడ్యూల్ తీసుకురావడంతో పోడు రైతులకు కూడా ఇక నుంచి పంట రుణాలు అందనున్నాయి. పంట నష్టపరిహారం, విద్యుత్ సౌకర్యం, మార్కెట్లో పంట సులువుగా అమ్ముకోవడం వంటి ప్రయోజనాలు దక్కుతున్నాయి. పోడు చేసుకుంటున్న ఆదివాసీగిరిజన రైతులకు న్యాయం చేయడంలో రైతు కమీషన్ కృషి కీలకమైనది. గతంలో మొక్కజొన్న విత్తనోత్పత్తి చేసి నష్టపోయిన గిరిజన రైతులకు నష్టపరిహారం అందించడం ద్వారా రైతు కమీషన్ కృషి చేసిన విషయం తెలిసిందే. దేశంలోనే మొదటి సారిగా మల్టీనేషనల్ విత్తన కంపెనీల నుండి దాదాపు 4 కోట్ల వరకు నష్టపరిహారం అందించబడింది. దీంతో రైతు కమీషన్ పై మరింత నమ్మకం పెంచుకున్న గిరిజన రైతులు మరిన్ని సమస్యలు కమీషన్ దృష్టికి తెచ్చారు. పోడు పట్టాలు పంట రుణాలు అందలేదని రైతు కమీషన్ దృష్టికి ఆదివాసీ గిరిజనులు తీసుకొచ్చారు. దాదాపు 2 లక్షల 30వేల మంది రైతులకు 6 లక్షల 70 వేల ఎకరాలు ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద పట్టాలున్నాయి. అయితే, గత ప్రభుత్వం వాటిని ధరణి పోర్టల్లో చేర్చలేదు. దీంతో వారు పంట రుణాలకు నోచుకోలేదు. ఆ భూముల వివరాలు భూ భారతి పోర్టల్లోనూ మొదట కనిపించలేదు.
ఈ విషయాలను చివర్లో రైతు కమీషన్ దృష్టికి ఆదివాసీ గిరిజనుల బృందం తీసుకొచ్చింది. దీన్ని రైతు కమీషన్ సీరియస్ గా తీసుకోవడం.. ఎస్ఎల్బీసీ కమిషన్ గిరిజన రైతుల సమస్యలపై, ఐటీడీఏ, ఫారెస్ట్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి గిరిజన రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన రైతులు పడ్తున్న ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వానికి రైతు కమిషన్ నివేదకను అందజేసింది. ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం పోడు పట్టాలు.. భూ భారతి పోర్టల్ లో కనిపించకపోవడం.. పంటరుణాలు రావడం లేదని, బోర్లు వేసుకునే అనుమతులు రాకపోవడం, విద్యుత్ సరఫరా కూడా అందలేదని ప్రభుత్వానికి వివరించింది. అంతేకాదు పండిన పంట అమ్ముకునే కొనుగోలు కేంద్రాల వద్ద అమ్ముకునే పరిస్థితి లేదని ఎత్తిచూపింది. ఒకవేళ పంట నష్టపోతే.. నష్టపరిహారం కూడా అందకుండా పోతుందనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. కమీషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు విన్నపం మేరకు.. సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ గిరిజన రైతుల భూముల వివరాలను భూ భారతి పోర్టల్లో చేర్చడాన్ని చూశారు. ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం పోడు భూముల వివరాలు భూ భారతి పోర్టల్ లో కనిపించేలా కొత్త మాడ్యూల్ తీసుకొచ్చారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 30 వేల మందికి మేలు జరిగింది. ఇక నుంచి ఆదివాసీ గిరిజన రైతులకు పంట రుణాలు, నష్టపరిహారం, బోర్లు, విద్యుత్ సరఫరా అందనుంది. పండిన పంట కూడా ఈజీగా అమ్ముకోడానికి అవకాశం ఉంటుంది.
ఆదివాసీ గిరిజన రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి రైతు కమీషన్ చైర్మెన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, కెవీఎన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, భూమి సునీల్, గోపాల్ రెడ్డి, గడుగు గంగాధర్, భవానీ రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతు కమీషన్’కృషితోనే విత్తన కంపెనీల పరిహారం, ఇప్పడు పంట రుణాలు : కొర్స నర్సింహా మూర్తి, ఆదివాసీ నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు ఆదివాసీ గిరిజన రైతుల కోసం రైతు కమీషన్ ఎంతో కృషి చేస్తోంది. మొక్క జొన్న విత్తనోత్పత్తి చేసి నష్టపోతే.. మాకు విత్తన కంపెనీల నుంచి రూ. 4 కోట్ల నష్టపరిహారం ఇప్పించిన ఘనత రైతు కమీషన్. పాలెం వాగు సాగునీటి ప్రాజెక్టు ద్వారా 10కిలోమీటర్ల వరకు పోడు భూములకు నీరు అందించడానికి రూ.52 లక్షలు ఇప్పించింది. దాని ద్వారా 10వేల 132 ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఒంటిమామిడిలో గిరిజనేతరుల చేతుల్లో ఉన్న 60 ఎకరాలను విడిపించి గిరిజనులకు అందజేయడంలోనూ కమీషన్ కృషి ఉంది. ఇప్పుడు ఆర్వోఎఫ్ఆర్ కింద ఉన్న భూములు భూ భారతిలో కనిపించే మాడ్యూల్ తేవడం తో పంటరుణాలు పొందుతున్నాం. బోర్లు, విద్యుత్ సరఫరా కూడా అందుతోంది. ఆదివాసీ గిరిజన రైతులకు న్యాయం జరుగుతోంది.
పోస్ట్ ఆర్ఓఎఫ్ఆర్ భూములకూ పంటరుణాలు మొదట కనిపించింది నవతెలంగాణ.

