– ప్రకటన –
పారిస్ : వారి నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ను కలిసేందుకు అనేక మోడల్స్‌ను ఏర్పాటు చేసిన ఫ్రాన్స్ ప్రొఫెషనల్ మోడల్ రిక్రూటర్ డేనియల్ సియాద్ పారిస్‌లోని తన నివాసంలో విగతజీవిగా కన్పించాడు. ఫ్రాన్స్ రాజధాని శివారు ప్రాంతమైన కొలంబెస్‌లోని నివాస గృహంలో సియాద్ మృతదేహం లభించిందని నాంటెర్ జ్యుడీషియల్ కోర్టు డిప్యూటీ ప్రాసిక్యూటర్ మేరీ- సెలిన్ లారిజ్ చెప్పారు. మరణానికి కారణం ఏమిటో తెలుసుకునేందుకు సియాద్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు పంపారు. ఇటీవల సీఎన్ఎన్కు సియాద్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను ఎప్స్టీన్కు ఇద్దరు మహిళలను పరిచయం చేశానని, అయితే ఆయన వల్ల వారికి హాని ఉందని నమ్మడానికి కారణాలేవీ కన్పించలేదని ఆ సందర్భంగా చెప్పారు. అంతకుముందు ఆ ఇద్దరు మహిళలు సీఎన్ఎన్తో మాట్లాడుతూ ఎపిస్టీన్ తమను వేధించారని అన్నారు. చేసిన నేరాలకు శిక్ష అనుభవించానని ఎప్స్టీన్ తనతో అన్నారని సియాద్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను పరిచయం చేసిన వారితో ఇలాంటివి ఇక ముందు ఎన్నడూ జరగబోవని కూడా హామీ ఇచ్చారని చెప్పారు. తాను ఎప్స్టీన్ను నమ్మానని, ఆయన ఓ వృత్తి నిపుణుడని విశ్వసించానని అన్నారు. ఎప్స్టీన్తో పరిచయం ఉన్న వారు తమకు ఇబ్బంది కలిగిందని చెప్పడం తాను ఎన్నడూ వినలేదని చెప్పారు. వారి నేరాల కేసులో ఎప్స్టీన్కు 2008లో శిక్ష పడిన తర్వాత కూడా మోడలింగ్ పరిశ్రమలోని సియాద్ వంటి వ్యక్తులు ఆయనతో వ్యాపార అవకాశాలను కోరుకున్నారు. ఆయనను ఫ్యాషన్ ఈవెంట్లకు ఆహ్వానించారు. తమ కంపెనీలతో సంబంధాలు పెట్టుకోవడానికి అనుమతించారు.
– ప్రకటన –

