కొందరు అధికారుల అత్యుత్సాహం ఉద్యోగుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారు. అలాంటి వాటిపై ఆయా ప్రాంతాలకు చెందిన పాలకులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వాదనలు అయితే బలంగానే వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనే ఇప్పుడు తెలంగాణలో ఒకటి జరిగింది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఒకింత దృష్టి సారించి బాధితుడికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. అలాగే అనవసరంగా ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆయా శాఖల అధికారులను కూడా అదుపు చేయాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.
అయినా ఏం జరిగిందన్న విషయానికి వస్తే… తెలంగాణ ఆర్టీసీలో అశోక్ అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. జగిత్యాల పరిధిలో ఉద్యోగ నిర్వహణలో ఉన్న అశోక్… రోజూ మాదిరే బస్సులో ప్రయాణికులను ఎక్కించుకుని ముందుకు సాగుతున్నాడు. ఈ ఓ ప్రదేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వారు ఆందోళన చేస్తుండగా… బస్సును అక్కడికక్కడే నిలిపివేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా తన గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో అశోక్ మాట కలిపారు.
పెట్రోల్, డీజిల్ ధరలు అలా పక్కనపెడితే… రైతులు పండించిన ధాన్యాన్ని కొనేలా చూడాలంటూ ఈ సందర్భంగా అశోక్ తన గ్రామస్తుడితో చెప్పారట. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అమ్ముడుబోక రైతులు నానా పాట్లు పడకుండా, పంటలు కొంటేనే కదా… అన్నదాతల ఇళ్లు కూడా నడిచేది అని ఆయన అన్నారట. ఈ పరిశీలన ఎవరు చెప్పారో, ఏమో తెలియదు గానీ… అశోక్ పై చర్యలకు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ఉపక్రమించారు. అశోక్ ను విధుల్లో నుంచి తప్పించిన ఆర్ఎం…అశోక్ కు పనేమీ ఇవ్వకూడదని తన పరిధిలోని ఐదు ఆర్టీసీ డిపో ఆర్ ఎం ఆదేశాలు జారీ చేశారట.
ఈ విషయం తెలిసిన అశోక్ లబోదిబోమంటున్నారట. పెట్రోల్, డీజిల్ ధరల గురించి తానేమీ మాట్లాడలేదని, రైతుల ఇబ్బందుల గురించి తాను మాట్లాడానని, అది కూడా తన గ్రామానికి చెందిన వ్యక్తి కనిపిస్తేనే ఏదో అలా మాట కలిపానని అశోక్ వాపోతున్నారు. ఈ దానికే తన ఉద్యోగాన్ని తొలగించే దిశగా ఆర్ ఎం చర్యలు తీసుకుంటే తన జీవనాధారాన్ని తీసివేయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చూడడానికి ఇది చిన్న విషయమే అయినా…ఆర్ఎం చేసిన పని అశోక్ కుటుంబం మొత్తం మీద పెను ప్రభావం చూపడం ఖాయమే కదా. అందుకే ఈ తరహా ఘటనలపై సీఎం రేవంత్ ఓ కన్నేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

