సీనియర్ నటుడు జగపతిబాబు కెరీర్లో ఎక్కువగా చేసినవి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలే. 90వ దశకంలో ఆయన చేసిన ‘శుభలగ్నం’ సహా పలు చిత్రాలతో కుటుంబ ప్రేక్షకుల్లో, ముఖ్యంగా లేడీస్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు. ఐతే హీరోగా అవకాశాలు తగ్గిపోయి ఖాళీ అయిపోతున్న టైంలో ఆయన ‘లెజెండ్’ మూవీతో విలన్ అవతారం ఎత్తాడు. ఆపై విలన్‌గానే కాక క్యారెక్టర్ రోల్స్‌తోనూ మెప్పిస్తూ సాగిపోతున్నారు. ‘పటేల్’ లాంటి చిత్రాల్లో అప్పుడప్పుడూ లీడ్ రోల్స్ చేసినా పెద్దగా ఫలితం దక్కలేదు.
ఐతే ఇప్పుడు జగపతి లీడ్ రోల్లో ‘వదలా’ అనే సినిమా వస్తోంది. ఒకప్పుడు ‘మనోహరం’లో జగపతికి జంటగా నటించిన లయ ఇందులో ఆయన సరసన నటించడం విశేషం. ఐతే ఇందులో ఇంకో అమ్మాయి పాత్ర కూడా ఉంది. జగపతి ఇందులో వయసుకు తగ్గట్లే మిడిలేజ్డ్ రోల్లో కనిపించనుండగా.. అంత పెద్ద వయస్కుడిని ప్రేమించే టీనేజీ అమ్మాయి పాత్రలో హృతిక శ్రీనివాస్ నటించింది.
‘వదలా’ అనే టైటిల్ చూస్తే ఇదేదో దయ్యం క్యారెక్టర్ మనిషిని వదలా అని అంటున్నట్లు అనిపిస్తుంది. కానీ ఇక్కడ కథ వేరు. తన కంటే వయసులో చాలా పెద్ద వాడిని ప్రేమించి, నిన్ను వదలా అంటూ తన వెంటపడే అమ్మాయి స్టోరీలా ఉంది. ఈ కాన్సెప్ట్‌కు తగ్గట్లే జగపతి, హృతికల మీద ఒక రొమాంటిక్ టచ్ ఉన్న పాటను కూడా తీశారు.
సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో జగపతి చాలా స్టైలిష్‌గా కనిపించాడు.. నిన్ను వదలా అంటూ ఆయన వైపు కసిగా చూస్తే అమ్మాయిగా హృతిక కనిపించింది.
కానీ రెండు క్యారెక్టర్ల మధ్య ఏజ్ గ్యాప్ అది చూస్తే.. ఈ కాన్సెప్ట్ మన ప్రేక్షకులకు ఏమాత్రం ఎక్కుతుందో అన్న సందేహాలు వస్తున్నాయి. ముఖ్యంగా జగపతికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆయనకు ఇలాంటి పాత్రను ఇవ్వడం, ఇలాంటి కాన్వాస్‌లో నటింపజేయడం కరెక్టేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఐతే కేవలం ప్రోమోలు చూసి ఒక్క అంచనాకు రాలేం కాబట్టి.. సినిమాలో ఇంతకుమించి, ఏమైనా చూపించి దర్శకుడు మెప్పిస్తాడేమో చూడాలి. ఆకెళ్ల వి.కృష్ణ రూపొందించిన ఈ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. కిషోర్ నాయుడుతో కలిసి నిర్మించారు.

