ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిగడ్డ తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. విటమిన్లు, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటే ఉల్లిగడ్డలు ఇమ్యూనిటీని పెంచుతాయి. ఎండలు దంచికొడుతున్న ఈ టైంలో చలువ కూడా. ప్రతికూరలో ఉల్లిగడ్డ వేస్తుంటాం. కానీ, ఉల్లిగడ్డతోనే చాలా వెరైటీలు చేసుకోవచ్చు. ఉల్లిగడ్డ స్పెషల్స్ మీకోసం.
ఉల్లిగడ్డ మురుకులు తయారీకి కావాల్సినవి
- బియ్యం- మూడు కప్పులు
- ఎండుమిర్చి – ఆరు
- ఉల్లిగడ్డ ముక్కలు – ఒక కప్పు
- వెన్న -రెండు టేబుల్ స్పూన్లు
- ఉప్పు – తగినంత
- పుట్నాల పొడి- అరకప్పు
- నువ్వులు – రెండు టేబుల్ స్పూన్లు
- ఇంగువ – చిటికెడు
- – వేగానికి సరిపడా నూనె
- నీళ్లు-తగినన్ని
ఉల్లిగడ్డ మురుకులు తయారీ విధానం
బియ్యం బాగా కడిగి దాదాపు ఆరు గంటలు నానబెట్టాలి. తర్వాత ఎండుమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. తర్వాత ఉల్లిగడ్డముక్కలు, నువ్వులు, పుట్నాల పొడి, వెన్న వేసి మురుకుల పిండిలా కలపాలి. కళాయిలో నూనెపోసి బాగా వేడయ్యాక ఈ పిండిని మురుకుల్లా వత్తి నూనెలో వేసి ఎర్రగా వేగించాలి. అంతే.. కరకరలాడే ఉల్లిగడ్డ మురుకులు తయారీ. టేస్ట్ తో పాటు మంచి విటమిన్లు కూడా శరీరానికి అందుతాయి.
ఆనియన్ రింగ్స్ తయారీకి కావాల్సినవి
- ఉల్లిగడ్డ – పెద్దది ఒకటి
- మైద – ఒకటిబావు కప్పు
- బేకింగ్ పౌడర్ – ఒక టీస్పూన్
- ఉప్పు – ఒక టేబుల్ స్పూన్
- గుడ్డు – ఒకటి
- పాలు – ఒక కప్పు
- బ్రెడ్ క్రాంబ్స్- ముప్పావు కప్పు
- – వేగానికి సరిపడా నూనె
ఆనియన్స్ రింగ్స్ తయారీ విధానం
ఉల్లిగడ్డలను రింగ్స్ గా తరగాలి. ఒక గిన్నెలో మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు అన్నీవేసి కలపాలి. ఇంకో గిన్నెలో బ్రెడ్ క్రాంబ్స్, పాలు, గుడ్డు వేసి బాగా కలపాలి. రింగ్స్ లా కోసిపెట్టిన ఉల్లిగడ్డముక్కలకు మైదా మిశ్రమం పట్టించి తర్వాత బ్రెడ్ క్రాంబ్స్ లో ముంచాలి. ఒక కళాయిలో నూనె బాగా వేడిచేసి ఈ రింగ్ ను డీప్ ఫ్రై చేస్తే క్రిస్పీ, క్రిస్పీ అనియర్ రింగ్స్ తయారీ. ఎండాకాలం ఈ ఫుడ్ ఇమ్యూనిటి పవర్ అందిస్తుంది.

