పోలీసులు ఎన్ని నిర్బంధాలు పెట్టినా.. కొందరు గంజాయి స్మగ్లింగే జీవనోపాధిగా మలచుకుంటున్నారు. సినిమా తరహాలో కొత్త టెక్నిక్స్ ఉపయోగించి ట్రాన్స్ పోర్ట్ చేస్తున్నారు. లేటెస్టుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లారీ కంటెన్ లో సీక్రెట్ రూమ్ ఏర్పాటు పోలీసుల కళ్లుగప్పి రెండున్నర కోట్ల విలువైన గంజాయి ట్రాన్స్ పోర్ట్ చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
2026 జూన్ 30వ తేదీన సంయుక్త ఈగల్ ఫోర్స్ టీమ్, భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ లో రెండున్నర కోట్ల గంజాయి రవాణా ప్లాన్ ను భగ్నం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్గంపాడు మండలం సరపాక ఐటీసీ వెస్ట్ గేట్ దగ్గర లారీని పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు రూ.2.625 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
గంజాయిని ఒడిశా అల్లూరికోట ప్రాంతం నుంచి సేకరించి ఉత్తరప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. కంటెయిన్ లారీలో ప్రత్యేక రహస్య గది (అర) ఏర్పాటు చేసి గంజాయిని దాచినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులతో పాటు ఓ మైనర్ని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు ప్రధాన నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నారు.
నిందితుల నుంచి ఒక కంటైనర్ లారీ, బజాజ్ పల్సర్ బైక్, ఐదు మొబైల్ ఫోన్లు, 10 వేల 570 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

