దేశ సరిహద్దుల్లో జవాన్లు లేకపోతే.. దేశంలో జనాలకు రక్షణ లేదు. ప్రాణాలు ఫణంగా పెట్టి దేశాన్ని కాపాడే సైనికుడు కావాలని ఆ యువకుడు కలలు కన్నాడు. కానీ, తన ఆశలు మధ్యలోనే ఆవిరయ్యాయి. అయినా, వెనుకడుగు వేయలేదు. బార్డర్లో గస్తీ కాసే అవకాశం తనకు రాకపోయినా.. తన కోసం ఉక్కు కవచాలను సరిహద్దుల్లోకి పంపాలని నిర్ణయించుకున్నాడు. ఆర్మీలో చేరాలనుకునే గ్రామీణ యువత కోసం ‘సైనికా’ వాట్సప్ గ్రూప్ పెట్టి వారికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు 23 ఏళ్ల అరిగె లోకేశ్. ‘సైనికా యూత్ మోటివేషన్ సంస్థ’ ప్రారంభించి దేశ సేవకు సహకరిస్తున్న లోకేశ్ బతుకమ్మతో పంచుకున్న విశేషాలు తన మాటల్లోనే…
సిద్దిపేట నిర్మాణం గంభీర్పూర్ గ్రామం మాది. దేశసేవ తరగతినే ఆలోచన తొమ్మిదో నుంచే నా మనసులో బలంగా నాటుకుపోయింది. సైన్యంలో ఎలా చేరాలని మా ఊళ్ళో పెద్ద చదువులు చదివిన అందరినీ అడిగాను. చాలామంది ఎగతాళిగా చూశారు. ఇంకొందరైతే తప్పుడు సమాచారం ఇచ్చారు. అయినా కూడా నా ఆశయం చంపుకోకుండా ప్రయత్నిస్తూనే పదోతరగతి పూర్తి చేశాను. ఆ సమయంలోనే సోషల్ మీడియాలో బీఎస్ఎఫ్లో పనిచేస్తున్న మహేందర్ రెడ్డన్న పరిచయం అయ్యాడు. ఆయనది మా ఊరి పక్కనున్న చీకోడ్. కేవలం ఫోన్లోనే సైన్యంలో చేరేందుకు కావాల్సిన వివరాలు, అందులో పడే నోటిఫికేషన్ల గురించి చెబుతుండేవాడు. చివరికి నాకు రన్నింగ్ షూస్, బుక్స్ కూడా కొనిచ్చాడు. ఆ సమయంలోనే ఆర్మీ నోటిఫికేషన్ పడిపోయింది. హకీంపేటలో సెలెక్షన్స్ ఉన్నాయి. ఆ అన్న సహాయంతోనే అక్కడికి వెళ్లాను. ఆ ఓపెన్ ర్యాలీకి వేలమంది రావడం చూసి టెన్షన్ పడ్డాను. ఆయనకు ఫోన్ చేసి నా వల్ల కాదని చెప్పాను. కానీ, అన్న ధైర్యాన్నిచ్చాడు. ఆ ప్రోత్సాహంతో రన్నింగ్‌తోపాటు మెడికల్ ఫిట్‌నెస్‌లోనూ ఎంపిక అయ్యాను. ఇక ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో రాత పరీక్షకు సిద్ధమవుతున్న సమయంలో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసి కేంద్రం అగ్నిపథ్‌ని తీసుకొచ్చింది.
అన్న ఆశయం బతకాలని..
ఎంతో కష్టపడి చివరిదాకా వచ్చిన నాలాంటి వాళ్లకు అగ్నిపథ్ నిరాశనే మిగిల్చింది. ఆ బాధలో ఉన్న నాకు మరో దెబ్బ తగిలింది. నన్ను సైనికుడిగా చూడాలన్న మహేందరన్న విధుల్లో ఉండగానే మరణించాడు. నాకు ఉన్న ఒక్క తోడు దూరమైందని కుమిలిపోయాను. ఆయన అంత్యక్రియలకు వెళ్లినప్పుడు మహేందరన్న ఎంత గొప్పోడో అర్థమైంది. నాకన్నా ముందు మరో 20 మందికి ఆయన మార్గదర్శిగా నిలిచి, ఉద్యోగం సాధించినట్లు తెలిసి చాలా గర్వించాను. మహేందరన్న మరణంతో అమ్మ నన్ను ఆర్మీలోకి వెళ్లొద్దని కట్టడి చేసింది. కుటుంబం కోసం ఆర్మీకి దూరమైనా.. అన్న ఆశయం బతికించాలనుకున్నా. భారత సైన్యంలో చేరాలనుకునే యువతకు తోడుగా ఉండాలని 2022లో ‘సైనికా యూత్ మోటివేషన్ సొసైటీ’ అనే వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేశాను. నా మిత్రుల సహాయంతో అందులో ఒక్కొక్కరినీ యాడ్ చేసి నిత్యం వారికి ఆర్మీ నోటిఫికేషన్లు , ప్రశ్నపత్రాల నమూనా పేపర్లు అప్లోడ్ చేయడం ప్రారంభించాను. వారి లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా మా గ్రూప్ పనితీరు ఉంటుంది. ఆ తరువాత నెమ్మదిగా అన్ని జిల్లాలకు విస్తరించాం.
50 జిల్లాల్లో..
కేవలం నోటిఫికేషన్లు చెప్పడం కాకుండా ఆర్మీ సెలక్షన్లకు వెళ్లేవారందరికి ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం, ఆర్థికంగా స్తోమత లేనివారికి ఫ్రీగా మెరియల్ అందించడం ప్రారంభించాం. 2025లో ‘భవిష్య భారత్’ సంస్థ మాకు తోడుగా నిలిచింది. సంగారెడ్డిలోని సంస్థ క్యాంప్‌లో అరవై రోజుల పాటు ఉచిత వసతితోపాటు ఫ్రీగా శిక్షణ ఇచ్చింది. వాళ్లు నిర్వహించే ప్రతి శిబిరంలోనూ మా అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. మరోవైపు మా ‘సైనిక’ రెండు తెలుగు సినిమాల్లో దాదాపు 50 జిల్లాలకు విస్తరించింది. ఆయా జిల్లాల్లో ఇన్‌చార్జ్‌లను నియమించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా దగ్గర శిక్షణ పొందిన వాళ్లలో దాదాపు 250 మందికి పైగా సైనికులుగా కొలువులు సాధించారు. ఇటీవల 69 మంది ఒకేసారి సైన్యానికి ఎంపికయ్యారు. వారంతా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినవాళ్లే! సైన్యంలో ఉద్యోగం పొందలేని వాళ్లలో కొందరు పోలీస్ డిపార్ట్మెంట్లో కొలువులు కొల్లగొట్టారు. ప్రస్తుతం మా సంస్థ ద్వారా 13వేల మంది అభ్యర్థులు శిక్షణ తీసుకుంటున్నారు.
ప్రభుత్వం సహకరిస్తే..
మా ‘సైనికా యూత్ మోటివేషన్ సొసైటీ’ సేవలకు తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. కేవలం సైనిక శిక్షణ కాకుండా ప్రస్తుతం యువతను పట్టిపీడిస్తున్న గంజాయిపై పోరాడుతున్నాం. క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. ఇప్పటివరకు సైన్యంలో చేరేవారికి ప్రభుత్వ మైదానాలు కరువయ్యాయి. రెండు తెలుగు సినిమాల్లోని ప్రభుత్వాలు సహకరించి ప్రతి జిల్లాలో ఒక ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ నిర్మించి ఇస్తే అందులో మేము ఉచితంగా ట్రైనింగ్ ఇస్తాం. ఈ దిశగా ప్రభుత్వాలు సహకరించాలని కోరుకుంటున్నాను.
– రాజు పిల్లనగొయిన

