గత కొన్ని వారాల నుంచి సోషల్ మీడియాని ఊపేస్తున్న మాట ఓజి 2. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ హ్యాండిల్ నుంచి అప్డేట్స్ మొదలయ్యాయో అక్కడి నుంచి ఫ్యాన్స్ అలెర్ట్ అయిపోయారు. పవన్ దర్శకుడు సుజిత్ తో చర్చలు జరిపిన ఫోటోలు బయటికి వచ్చాక హైప్ మరింత పెరిగింది. మొదటి భాగం గత ఏడాది మూడు వందల కోట్లకు పైగా వసూలు చేశాక దీనికి సీక్వెల్ కావాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ నిరీక్షణ ఫలించనుంది.
తాజాగా జరిగిన హృదయం మురళి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సంగీత దర్శకుడు తమన్ ని ఆడియన్స్ చాలాసేపు మాట్లాడనివ్వలేదు. అరుపులు ఈలలతో హోరెత్తించారు. చివరికి సెప్టెంబర్ లో ఓజి 2తో కలదాం అని హింట్ ఇచ్చాక అప్పుడు శాంతించారు. అంటే అదే నెలలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కాబట్టి అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు చిన్న టీజర్ వచ్చే అవకాశాలున్నాయని వచ్చిన వార్త నిజమని అర్థం చేసుకోవాలి. సో రెండు నెలలు వెయిట్ చేయాలి.
షూటింగ్ ఎప్పటి నుంచి రిలీజ్ ఎప్పుడు ఉండొచ్చు లాంటివి అంత ఈజీగా తేలవు కానీ పవన్ మనసులో వచ్చే సంవత్సరం చివరిలో రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే సుజిత్ అవతల నానికి బ్లడీ రోమియో చేయాలి. కాబట్టి ఓజి 2 మీద ఎక్కువ సమయం గడపడానికి లేదు. ఇది పవన్ కు కూడా తెలుసు. అందుకే తక్కువ వర్కింగ్ డేస్ లో ఎలా పూర్తి చేయొచ్చనే దాని మీద ఇద్దరూ చాలాసేపు డిస్కషన్ చేసుకున్నారని జనసేన వర్గాల మాట.
ఏదైతేనేం మొత్తానికి ఓజి 2 సెట్స్ పైకి వెళ్ళడానికి రూటు దొరికింది. మరి సురేందర్ రెడ్డితో ప్లాన్ చేసుకున్న సినిమా సంగతేంటి అంటే ఇంకొంచెం సమయం పట్టేలా ఉంది. ఏది డిసైడ్ చేసుకున్నా పవన్ చేతిలో మహా అయితే ఇంకో ఏడాదిన్నర మాత్రమే ఉంది. తర్వాత ఎన్నికల ప్రణాళికలు, జనసేన అభ్యర్థుల కసరత్తు, సీట్ల పంపకాలు, ప్రచారాలు వగైరా బోలెడు వ్యవహారాలు ఉంటాయి. సో ఓజి2తో పాటు ఇంకొక్క సినిమా చేసే ఛాన్స్ ఉంది. అది సూరిదా కాదా అనేది ఇంకా తేలాలి.

