- కందుకూరు నుంచి 4సార్లు మానుగుంట గెలుపు..
- గత ఎన్నికల్లో బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీ, ఓటమి..
- సైలెంట్‌గా ఉన్నా.. పార్టీని విమర్శించని మహీధర్‌రెడ్డి..
- వైసీపీలో మళ్లీ యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారా..
- ప్రకాశం, నెల్లూరు జిల్లాల పార్టీ అధ్యక్షులతో అనుచరుల భేటీ..
- మాజీ మంత్రికి తెలియకుండానే అనుచరులు ఆ స్థాయికి వెళతారా?..
- మహీధర్‌రెడ్డి వైసీపీ అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నారా?…
- పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఇన్ఛార్జ్ బుర్రా..
- మహీధర్‌రెడ్డి యాక్టీవ్ అయితే మధుసూదన్ యాదవ్ పరిస్థితి ఏంటి?…
- కేడర్‌లో అయోమయం సృష్టిస్తున్నారని బుర్రావర్గం మండిపాటు..
ఆఫ్ ద రికార్డ్: కందుకూరు రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి. ఇక్కడి నుంచి కాంగ్రెస్, వైసీపీ తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే… గత ఎన్నికల్లో అనూహ్యంగా ఇక్కడి నుంచి వైసీపీ తరపున మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీ చేసి ఓడారు. ప్రస్తుతం నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఆయనే కొనసాగుతున్నారు. ఇక తనకు టికెట్ దక్కడం పూర్తిగా సైలెంట్ అయ్యారు మహీధర్‌రెడ్డి. వైసీపీకి కార్యకలాపాలకు దూరంగా ఉన్నా… ఎప్పుడూ బహిరంగంగా విమర్శించలేదు. అదే సమయంలో అటు కూటమికి దగ్గరైనట్టు కూడా కనిపించలేదు. కానీ… ఇటీవల ఆయన వైఖరి మారుతున్నట్టు. వచ్చే ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని సన్నిహితులకు చెబుతున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం. ఏ పార్టీ తరపున అన్నది స్పష్టంగా చెప్పకున్నా…. పోటీలో ఉంటానని మాత్రం పదేపదే అనడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీస్తోంది. దీంతో మహీధర్ రెడ్డి మళ్లీ వైసీపీలోనే యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారా అనే ప్రశ్న చాలామందిలో ఉదయిస్తోంది. ప్రస్తుతం మహీధర్‌రెడ్డి బయటికి అంత యాక్టివ్‌గా కనిపించకున్నా… ఆయన సన్నిహితుల కార్యకలాపాలు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి.
కందుకూరు నియోజకవర్గంలో మహీధర్ రెడ్డికి సన్నిహితంగా ఉండే వైసీపీ మండల స్థాయి నేతలు ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని కలిశారట. పెద్ద పార్టీలు పిలిచి మాట్లాడితే… తిరిగి క్రియాశీలకంగా పనిచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలోకి మారినా… పార్టీ పరంగా నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గానికి అనుసంధానంగానే ఉందని, ఏదైనా ఉంటే…. ఆ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్దన్ రెడ్డితో మాట్లాడాలని బూచేపల్లి సూచించినట్లు తెలిసింది. దీనితో మానుగుంట సన్నిహితులు నేరుగా కాకాని కలిసి ఇదే ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా…. ఇక్కడ మరో ప్రశ్న కూడా వస్తోంది. సన్నిహితుల పేరుతో వ్యవహారం నడుస్తుందా…. మహీధర్ రెడ్డికి తెలియకుండానే ఇంత జరుగుతుందా? ఎంత సన్నిహితులైనా… ఆయనకు చెప్పకుండా ఇంత రాయబారం నడుపుతున్నారా అన్న ప్రశ్నలకు అలా జరగదన్నదే సమాధానం. కానీ…. మాజీ మంత్రి మాత్రం వీటితో నాకు సబంధమే లేదన్నట్టుగా ఉంటున్నారట.
దీనితో… ఇది నిజంగానే సన్నిహితుల చొరవా… లేక మహీధర్ రెడ్డి పంపిన రాజకీయ సంకేతమా అన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో ఆయన క్లారిటీ ఇస్తున్నారా? లేక ఎక్కువ కన్ఫ్యూజ్ చేస్తున్నారా అన్న చర్చలు సైతం మొదలయ్యాయి. మరోవైపు కందుకూరు వైసీపీ ఇన్‌చార్జ్‌లో ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ వర్గం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. గత… తమకు మహీధర్ రెడ్డి వర్గం ఎన్నికల్లో సహకరించలేదని బహిరంగంగానే చెబుతున్నారు బుర్ర అనుచరులు. పైగా ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే ఇప్పుడు ఇలాంటి ప్రచారం చేయడమంటే… కేడర్‌లో అయోమయం సృష్టించే ప్రయత్నమేనన్నది వాళ్ళ వాదన. అయితే ఇప్పటివరకు వైసీపీ అధిష్ఠానం వైపు నుంచి ఎలాంటి ఇండికేషన్స్.. రియాక్షన్స్ లేవట. ఇప్పటికే బుర్రా మధుసూదన్ యాదవ్, టీడీపీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మధ్య టఫ్ ఫైట్ నడుస్తోందని, రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్న టైంలో…నియోజకవర్గ వైసీపీ కేడర్‌లో అయోమయం సృష్టిస్తున్నారని మండి పడుతున్నారు. కానీ మహీధర్ రెడ్డి మాత్రం మరో పార్టీ వైపు వేయకుండా… రాజకీయ అవకాశాల కోసం నిలబడాలనే అభిప్రాయం బలపడుతోంది. మరి అధిష్ఠానం ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా… కందుకూరు రాజకీయాల్లో మరోసారి మహీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించాల్సిందే… లేక ఇది కేవలం రాజకీయ చర్చగానే మిగిలిపోతుందా..అన్నది తేలాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

