- ఉదయం 5.43 గంటలకు పుష్కరకాలం ప్రారంభం
- తొలి పుణ్యస్నానం ఆచరించనున్న కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ఎండ తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేసిన సర్కార్
భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు : భూపాలపల్లి జిల్లా కాళేశ్వర క్షేత్రం పుష్కర శోభను సంతరించుకుంది. ప్రాణహిత, గోదావరి నదులతో కలిసి అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నదికి ఇయ్యాల్టి నుంచి ‘అంత్య పుష్కరాలు’ ప్రారంభం కానున్నాయి. గురువారం తెల్లవారుజామున 5.43 గంటలకు పుష్కరకాలం ప్రారంభం. ఇయ్యాల్టి నుంచి 12 రోజుల పాటు జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
రెండు తెలుగురాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ 30 లక్షల నుంచి 40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు.. అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టారు. ఈసారి జరిగిన ఆది పుష్కరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రత్యేక కార్యాచరణ రూపొందించబడింది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు వ్యూహాత్మక చర్యలు చేపట్టారు. కాళేశ్వరం వద్ద రూ. 30.63 కోట్లతో కనీస వసతులతో పాటు వివిధ రకాల పనులు పూర్తి చేశారు.
అంత్య పుష్కరాలకు కంచి పీఠాధిపతి, గవర్నర్
గురువారం తెల్లవారుజామున 5.43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతీ స్వామితో పాటు గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల తొలి పుణ్యస్నానం ఆచరించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. వీరితో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా హాజరుకానున్నారు. 12 రోజుల పాటు ప్రతిరోజూ ఒక ప్రముఖ పీఠాధిపతి పుష్కర స్నానం ఆచరించనున్నారు.
పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం హోమాలు, సాయంత్రం హారతి, తెప్పోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గాల్లో రాత్రి వేళల్లో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఎల్ఈడీ లైట్లు అమర్చారు. భక్తులకు విశేషమైన వివరాలు ప్రత్యేక మీడియా సెంటర్ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు
ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నడక దారిలో మ్యాట్లు, క్యూ లైన్లపై చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు ఎండదెబ్బకు గురికాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. దీని కోసం రెండు భారీ ఓహెచ్ ఆర్ సీ ట్యాంకులను నిర్మించగా, 500 తాత్కాలిక టాయిలెట్లను సిద్ధం చేశారు. భక్తులు నదిలో స్నానాలు చేసే సమయంలో ప్రమాదాలు జరగకుండా 100 మంది గజ ఈతగాళ్లను నియమించారు.
వీరితోపాటు సేఫ్టీ బోట్లు, లైఫ్ రింగ్స్, ఎస్డీఆర్ ఎఫ్ బృందాలు నిరంతరం పర్యవేక్షించబడుతున్నాయి. ఘాట్లు, ఆలయ పరిసరాల్లో నిఘా కోసం 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పుష్కరాలకు సుమారు 1.70 లక్షల వాహనాలు వచ్చే అవకాశం ఉండటంతో 245 ఎకరాల విస్తీర్ణంలో 23 భారీ పార్కింగ్ జోన్లను సిద్ధం చేశారు. ఈ పార్కింగ్ కేంద్రాల నుంచి ఘాట్ల వరకు భక్తులను చేరవేసేందుకు 90 షటిల్ బస్సులు నడుపుతున్నారు. 300 మంది వైద్య సిబ్బందితో 23 వైద్య క్యాంపులను ఏర్పాటు చేశారు.
వైభవంగా జరుపుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : సరస్వతి అంత్య పుష్కరాలను భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. కాళేశ్వరం వద్ద జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. పుష్కర స్నానాలు ఆచరించేందుకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, రాకపోకలకు ఆటంకం ట్రాఫిక్ నియంత్రణ లేకుండా. పుష్కరాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ పుష్కర శుభాకాంక్షలు తెలిపారు.

