- కేన్స్ ఫెస్టివల్స్‌లో రక్త సింధూరం
- మిస్ వెనిజులా 2025పై దాడి
- రక్తసిక్తంగా మారిన బ్యూటీ క్వీన్
- రక్తమోడుతున్న వీడియో వైరల్
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సంచలన ఘటన. మిస్ వెనిజులా 2025 ఆండ్రియా డెల్ వాల్‌పై సెలబ్రిటీ స్టైలిస్ట్ లగూనా దాడి చేశాడు. ఈ మేరకు ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఆండ్రియా డెల్ వాల్ షాకింగ్ వీడియో విడుదల చేసింది. వీడియోలో ఆమె ముఖం మొత్తం రక్తంతో కనిపించడంతో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.
29 ఏళ్ల ఆండ్రియా డెల్ వాల్ మంగళవారం ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో ఉన్న హోటల్ గదిలో ఈ దాడి జరిగింది. “చూడండి.. జియోవన్నీ లగూనా నాకు ఇదే చేశాడు. నువ్వు నిజంగా ఎవరో ప్రపంచానికి తెలిసిపోయింది” అంటూ స్పానిష్‌లో వీడియోలో మాట్లాడింది. అనంతరం గది మొత్తం చిందరవందరగా మారిన దృశ్యాలను కూడా చూపించింది. హోటల్లో పెద్ద ఎత్తున అరుపులు, శబ్దాలు వినిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు విదేశీ మీడియా కథనాలు వెల్లడించాయి. పోలీసులు చేరుకునే సమయానికి జియోవన్నీ లగూన గదిలోనే ఉన్నట్లు సమాచారం. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
జియోవన్ని లగూనా లాటిన్ అమెరికాలో ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందాడు. 2023 నుంచి మిస్ యూనివర్స్ కొలంబియా క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. బ్యూటీ క్వీన్స్, సెలబ్రిటీలతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ఘటన తర్వాత ఆండ్రియా డెల్ వాల్‌కు వైద్య చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని సమాచారం. అయితే గొడవకు అసలు కారణమేంటన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఫ్రెంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

