హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హారర్ జానర్ పరిచయం చేసిన కల్ట్ సిరీస్ గా ‘ఈవిల్ డెడ్’ సినిమాకున్న ఆదరణ అంతా ఇంతా కాదు. 1981లో దీని మొదటి భాగం విడుదలైనప్పుడు థియేటర్ ఆడియన్స్ హడలిపోయారు. కొందరు గుండెపోటుతో చనిపోయిన ఉదంతాలున్నాయి. కేవలం 4 లక్షల డాలర్లతో తీస్తే 30 మిలియన్ల డాలర్లు వసూలు చేయడం చరిత్రలో నిలిచిపోయింది. ఈవిల్ డెడ్ తర్వాతే అన్ని దేశాల్లో దెయ్యాలను ఆధారంగా చేసుకుని వందల సినిమాలొచ్చాయి.
ఇంత హిస్టరీ ఉన్న ఈవిల్ డెడ్ లో ఇప్పటిదాకా అయిదు చిత్రాలొచ్చాయి. ఈవిల్ డెడ్ 2, ఆర్మీ ఆఫ్ డార్క్ నెస్ తర్వాత ఇరవై సంవత్సరాల గ్యాప్ తీసుకున్నారు. 2013లో టైటిల్ మార్చకుండా ఈవిల్ డెడ్ మరోసారి తీశారు. 2023లో ‘ఈవిల్ డెడ్ రైజ్’ వచ్చి జనాన్ని వణికించింది. తాజాగా ‘ఈవిల్ డెడ్ బర్న్’ అనే కొత్త మూవీ థియేటర్లలో అడుగు పెట్టింది. ఆశ్చర్యకరంగా తెలంగాణలోని పలు థియేటర్లలో ఈ సినిమాకు మంచి ఆక్యుపెన్సీలు నమోదు కావడం విశేషం.
కంటెంట్ విషయానికి వస్తే కథ పాతదే. భర్తను కోల్పోయిన ఆలీస్ ఫ్యామిలీతో కలిసి మనశాంతి కోసం దత్తమైన ప్రాంతంలో ఒక ఇంటికి వెళ్తుంది. అందులో ఉన్న బుక్ ఆఫ్ డెడ్ అనే పుస్తకం ద్వారా సమాధి చేయబడిన ఆత్మలు మేల్కొంటాయి. దీంతో అలీస్ తో పాటు వచ్చిన వాళ్ళు దెయ్యలుగా మారి రక్తదాహంతో తపించిపోతాయి. ప్రాణంగా చూసుకున్న వాళ్లే ప్రాణాలు తీయడానికి వస్తారు. ఈ విష వలయం నుంచి అలీషా ఎలా తప్పించుకుని బయట పడిందనేది అసలు స్టోరీ.
కథ కన్నా ఈవిల్ డెడ్ బర్న్ కథనం కట్టి పడేస్తుంది. విపరీతమైన వయోలెన్స్, రక్తపాతం తెరనిండా ఉన్నా ఈ జానర్ ని ఇష్టపడే మూవీ లవర్స్ ని బాగా మెప్పిస్తుంది. కొంత ల్యాగ్ మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ పైసా వసూలు చేస్తాయి. థ్రిల్, హారర్ ఎలిమెంట్స్ కి లోటు లేకుండా దర్శకుడు సెబాస్టియన్ వానిసెక్ తీసుకున్న జాగ్రత్తలు బాగానే ఉన్నాయి. అయితే కొత్తదనం ఆశిస్తే మటుకు ఈవిల్ డెడ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. వీర ఫ్యాన్స్ అయితే మాత్రం ఎంజాయ్ చేయొచ్చు.

