నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తమ రాజకీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, వచ్చే ఎన్నికల్లోనూ ఆ టికెట్ తమ కుటుంబానికే దక్కేలా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. కోటంరెడ్డి కోటలోకి మరొకరికి ప్రవేశం లేకుండా ఆయన వేస్తున్న రాజకీయ అడుగులు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. 2009లో నియోజకవర్గాల విభజనతో ఏర్పడిన నెల్లూరు రూరల్‌లో తొలి ఎమ్మెల్యేగా ఆనం వివేకానంద రెడ్డి గెలిచారు. ఆ తర్వాత 2014, 2019లో వైఎస్సార్సీపీ తరపున, 2024లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయాన్ని నమోదు చేసుకున్నారు.
తొలి నుంచి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తన తమ్ముడు, పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి టికెట్ ఇప్పించాలని శ్రీధర్ రెడ్డి పట్టుబట్టారు. అవసరమైతే తమ్ముడి కోసం తన సీటును త్యాగం చేయడానికైనా ఆయన సిద్ధపడ్డారు. అయితే, ప్రస్తుత నియోజకవర్గాల పునర్విభజన దాదాపు ఆగిపోవడంతో శ్రీధర్ రెడ్డి మళ్లీ రూరల్ నియోజకవర్గంపైనే పూర్తిగా ఫోకస్ చేశారు.
ఇదే సమయంలో, నెల్లూరు నగర పరిధిలోని డివిజన్లను ప్రభుత్వం నిర్ణయించడంతో రూరల్ పరిధిలోని డివిజన్లు ఇందులో కలిసే అవకాశం ఉంది. రూరల్‌లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, వచ్చే ఎన్నికల నాటికి ఈ మహిళా రిజర్వేషన్‌కు వెళ్తుంటే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఇది కూడా చదవండి: సీఎం చంద్రబాబు: లేబర్ అడ్డాలతో ఏపీలో నూతన అధ్యాయం.. కార్మికుల నైపుణ్యాలకు పదును పెట్టేలా స్కిల్ ట్రైనింగ్
ఈ పరిణామాలను ముందుగానే ఊహించిన కోటంరెడ్డి సోదరులు, తాజాగా శ్రీధర్ రెడ్డి చిన్న కుమార్తె సాయి వైష్ణవిని రాజకీయంగా తెరపైకి తీసుకువచ్చారు. గత ఎన్నికల ప్రచారంలో సోదరి హైందవితో కలిసి గడపగడపకూ తిరిగి తండ్రి విజయంలో కీలక పాత్ర పోషించిన సాయి వైష్ణవికి స్థానిక నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. తాజాగా ఆదివారం ఆమె అనూహ్యంగా మీడియా సమావేశం నిర్వహించి, రూరల్ పరిధిలోని 26 డివిజన్లు, 18 గ్రామాల పేర్లను, అక్కడి ముఖ్య నాయకుల వివరాలను ప్రస్తావిస్తూ వారంతా తమకు అత్యంత ఆత్మీయులని పేర్కొన్నారు.
Also Read: Amaravati News: అమరావతిలో తొలిదశ భూసేకరణ వేగవంతం.. విడివిడిగా CRDA నోటిఫికేషన్లు – రైతులకు మరో ఛాన్స్ !
నెల్లూరు రూరల్‌లో ఎల్లప్పుడూ టీడీపీ జెండానే ఎగరాలని, అధిష్టానం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆమె స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుమార్తెలకు కీలక పదవి ఇప్పించాలనే ఆలోచనతోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ స్కెచ్ వేశారని, భవిష్యత్తులో రిజర్వేషన్లు మారినా సీటు తమను దాటిపోకుండా ఉండేందుకే వైష్ణవిని తెరపైకి తెచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుమార్తె సాయి వైష్ణవి పొలిటికల్ ఎంట్రీతో ఇక్కడ రాజకీయాలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. నెల్లూరు రూరల్ లో డివిజన్లలో కార్యకర్తల పేర్లు, స్థానిక నేతల పేర్లు టకా టకా చెప్పడంతో టీడీపీ కార్యకర్తలే షాకయ్యారు. ఇక నుంచి సాయి వైష్ణవి సైతం తండ్రి శ్రీధర్ రెడ్డి తరహాలోనే నెల్లూరు రూరల్‌లో యాక్టీవ్‌గా ఉంటారని, ఇది ఆరంభం మాత్రమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇంకా చదవండి

