క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయబడితే ఏమి చేయాలి: ఈ రోజుల్లో చాలా మంది నగదు కంటే క్రెడిట్ కార్డులనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. షాపింగ్ నుంచి ఆన్లైన్ చెల్లింపుల వరకు కార్డ్ ద్వారానే చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే క్రెడిట్ కార్డ్ అకస్మాత్తుగా పనిచేయకుండా బ్లాక్ అవుతుంది. అలాంటి సమయంలో చాలామంది గందరగోళానికి గురయ్యారు. తమ ఖాతాలో డబ్బు సురక్షితంగా ఉందా? కార్డ్ హ్యాక్ అయ్యిందా? అనే భయాలు మొదలవుతాయి. ఇలాంటి సమయంలో టెన్షన్ పడకుండా ఇలా చేస్తే చాలు..
అయితే ప్రతి సందర్భంలోనూ కార్డు బ్లాక్ కావడం ప్రమాద సూచిక కాదు. చాలా సందర్భాలలో బ్యాంకులు భద్రత కోసమే ఈ చర్య తీసుకుంటాయి. ముఖ్యంగా అనుమానాస్పద లావాదేవీలు కనిపించినప్పుడు లేదా కార్డు దుర్వినియోగం అవకాశం ఉన్నప్పుడు బ్యాంకులు ముందస్తు జాగ్రత్తగా కార్డును తాత్కాలికంగా నిలిపివేస్తాయి. ఒకవేళ మీరు మీ కార్డు పోగొట్టుకున్నట్లు లేదా ఎక్కడో మర్చిపోయినట్లు బ్యాంకుకు సమాచారం ఇస్తే, వెంటనే దానిని బ్లాక్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఇతరుల మీ కార్డును ఉపయోగించి ఖర్చు చేయకుండా అడ్డుకోవచ్చు. కొన్నిసార్లు వరుసగా తప్పు PIN నమోదు చేసినా లేదా అసాధారణ ప్రాంతాలలో ట్రాన్సాక్షన్లు కూడా కార్డు బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా బ్యాంకు నుంచి వచ్చిన SMSలు, ఇమెయిల్‌లను పూర్తిగా పరిశీలించడం చాలా ముఖ్యం. ఎందుకంటే కార్డు ఎందుకు బ్లాక్ అయ్యిందో బ్యాంకులు సాధారణంగా సందేశాల రూపంలో సమాచారాన్ని పంపుతాయి. సమస్య అసలు ఏంటో అర్థం చేసుకుంటే తదుపరి చర్యలు తీసుకోవడం సులభం.అలాగే మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అయి కార్డు స్టేటస్‌ను తనిఖీ చేయాలి. కొన్ని సందర్భాల్లో భద్రతా కారణాలతో తాత్కాలికంగా నిలిపిన కార్డులను యాప్ ద్వారా మళ్లీ యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీని కూడా పరిశీలించడం మంచిది.
క్రెడిట్ కార్డు బిల్లు బకాయి ఎక్కువ రోజులు చెల్లించకపోయినా బ్యాంకులు కార్డును నిలిపివేయొచ్చు. అందుకే పెండింగ్‌లో ఉన్న వెంటనే క్లియర్ చేయడం అవసరం. చెల్లింపులు తర్వాత కొంతసేపటికి కార్డు మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది.సమస్య కొనసాగితే వెంటనే కస్టమర్ కేర్‌ను సంప్రదించడం ఉత్తమ మార్గం. బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడి అసలు కారణం తెలుసుకోవచ్చు. అవసరమైతే KYC వివరాలు ధృవీకరించబడిన కార్డును తిరిగి ప్రారంభించుకునే అవకాశం ఉంటుంది.ఒకవేళ కార్డు పూర్తిగా దెబ్బతిన్న, పోయినా లేదా భద్రతా సమస్యలు ఎక్కువగా ఉన్నా బ్యాంకు కొత్త కార్డును జారీ చేస్తుంది. కొత్త కార్డు వచ్చేవరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.
క్రెడిట్ కార్డు బ్లాక్ అవ్వడం అనేది భయపడాల్సిన విషయం కాదు. చాలా సందర్భాలలో అది డబ్బును రక్షించడానికి బ్యాంకులు తీసుకునే భద్రతా చర్య మాత్రమే. సరైన సమయంలో స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటే సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.

