బాలీవుడ్ లో స్పై డ్రామాలకు గడ్డు కాలం వచ్చేసింది. దురంధర్ పుణ్యమాని ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే ఫైట్లు పెట్టి నమ్మిస్తామంటే ప్రేక్షకులు అంగీకరించడం లేదు. యష్ రాజ్ సంస్థకు ఇది బాగా అనుభవిస్తోంది. టైగర్ 3 ఊహించని విధంగా ఫ్లాప్ కాగా వార్ 2 వేసిన దెబ్బ అంతా ఇంతా కాదు. హృతిక్ తారక్ ఇమేజులు కొంత కాపాడాయి కానీ లేదంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. తాజాగా విడుదల చేసిన అల్ఫా దారుణంగా దెబ్బ తింది. విమర్శకులు విరుచుకు పడ్డారు.
ఇదంతా ఇప్పుడు నిర్మాణంలో ఉన్న పలు స్పై డ్రామా సినిమాల మీద ప్రభావం చూపుతోంది. వాటిలో అడవి శేష్ గూఢచారి 2 ఉంది. మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అయ్యాక దాని సీక్వెల్ కోసం చాలా కాలం నుంచి మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. దర్శకుడు మారినా సరే సీక్వెల్ క్రేజ్ తగ్గదనే నమ్మకంతో నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నారు. డెకాయిట్ కోసం బ్రేక్ ఇచ్చిన శేష్ ఇటీవలే షూటింగ్ రీ స్టార్ట్ చేశాడు. దాదాపు సగంపైనే పూర్తయ్యిందని ఇన్ సైడ్ టాక్.
ఒకవేళ అడవి శేష్ దురంధర్ తరహాలో ఆర్గానిక్ మేకింగ్ తో కనక కట్టుకుంటే మేజర్ తరహాలో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ జానర్ ని సరిగ్గా ప్రెజెంట్ చేయగలిగితే నార్త్ జనాలు కనకవర్షం కురిపిస్తారు. కాకపోతే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. మేజర్ ఎంత సక్సెస్ అయినా శేష్ కి ఉత్తరాదిలో భారీ ఫాలోయింగ్ లేదు. డెకాయిట్ ఎంత పుష్ చేసినా హిందీలో ఆడలేదు. కారణం అలాంటి సెటప్ ఉన్న సినిమాలు చాలా చూసేశారు కాబట్టి.
కాబట్టి ఇప్పుడు గూఢచారి 2తో ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ సైడ్ టాక్ అయితే చాలా పాజిటివ్ గా వినిపిస్తోంది. మొదటి భాగానికి పదింతలు రిచ్ విజువల్స్, టేకింగ్ తో ప్రదర్శించుతోందని, ఖచ్చితంగా ఆడియన్స్ థ్రిల్ అవుతారని అంటున్నారు. వినయ్ కుమార్ నటిస్తున్న గూఢచారి 2 అనౌన్స్ మెంట్ వచ్చి మూడు సంవత్సరాలు దాటేసింది. ఈ ఏడాది రిలీజ్ అవుతుందో లేదో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

