అమరావతి: కానిస్టేబుల్ గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తూర్పుగోదావరి జిల్లా శ్రీరామ్‌పూర్ గ్రామానికి చెందిన వీర వెంకట్రావు కుమారుడు చంద్రమళ్ల వంశీ(31) ఎపిఎస్పిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాకినాడలో మూడో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి అతడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వంశీకి నిశ్చితార్థానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మహిళా కానిస్టేబుల్ వంశీపై రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వంశీ పిఎస్‌కు పిలిచి పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. మళ్లీ కౌన్సిలింగ్ నిర్వహించడంతో అదే రోజు అర్థరాత్రి రాజమహేంద్రవరంలోని రోడ్కమ్ రైలు వంతెన పైనుంచి గోదావరిలో దూకేశాడు. ఆత్మహత్య చేసుకునే ముందు తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు, ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. తన కుమారుడి పెళ్లి సంబంధం కుదిరిందని, ఇప్పటికే పరిచయం ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ పెళ్లి చేసుకోవాలని వంశీని ఒత్తిడి చేస్తోందని, ఆమెను పెళ్లి చేసుకోకపోతే పోతుందని పోలీసులు ఒత్తిడి తెచ్చారని వంశీ తండ్రి వీర వెంకట్రావు ఆరోపణలు చేశారు. అందుకే వంశీ గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి తెలిపాడు.

