వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే ఇండియా మాజీ పేసర్ శ్రీశాంత్ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఈ సారి ఏకంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై సంచలన ఆరోపణలు చేశాడు. 2023 డిసెంబర్లో జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) మ్యాచ్‌లో గంభీర్‌తో జరిగిన వాగ్వాదం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
మ్యాచ్ లో గంభీర్ తనను ఫిక్స్ అని పిలిచాడని ఆ మధ్య శ్రీశాంత్ ఆరోపించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. మరోసారి మాట్లాడుతూ.. గంభీర్ తనను దేశద్రోహి అని ముద్ర వేశాడని చెప్పడం వివాదంగా మారింది. ఆ మ్యాచ్‌లో గంభీర్‌కు బౌన్సర్ వేసిన తర్వాత ఈ వాగ్వాదం జరిగినట్లు చెప్పాడు.
గౌతీ (గంభీర్) మొదటి బంతికి ముందుకు వచ్చి ఫ్లిక్ చేశాడు, ఎందుకంటే అతనికి నా ఆట తెలుసు. అతని కోచింగ్ విషయం తెలియదు కానీ, అతను చాలా మంచి క్రికెటర్ నాకుతెలుసు. అందుకే నేను బౌన్సర్ వేశాను.. అని లల్లన్ టాప్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీశాంత్ చెప్పాడు.
ఆ సందర్భంగా గౌతీ నన్ను అనకూడని మాట అనేశాడు, ఫిక్సర్ అని పిలిచాడు, అని చెప్పాడు. నేను ముందుకు వంగి, గౌతీ భాయ్, మీరు బాగానే ఉన్నారా? అని అడిగాను. అప్పుడు అతను ‘FF’ (F-word) అనే బూతు పదాన్ని వాడాడు. ఆ తర్వాత మళ్ళీ ఫిక్స్, దేశద్రోహి అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు అంటూ చెప్పుకొచ్చాడు.
గంభీర్, శ్రీశాంత్, ఇండియా 2007 టీ20 ప్రపంచ కప్, 2011 ప్రపంచ కప్ గెలిచిన జట్లలో ఉన్నారు. అయితే వారి కెరీర్ ముగిసిన తర్వాత ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఐపీఎల్ 2013 సమయంలో ఫిక్సింగ్ ఆరోపణల తర్వాత శ్రీశాంత్‌కు విధించిన నిషేధం ఆధారంగానే గంభీర్ ఈ వ్యాఖ్యలను ప్రదర్శించారు. మొదట జీవితకాలం నిషేధం విధించబడింది.. ఆ తర్వాత ఏడేళ్లకు తగ్గించింది బీసీసీఐ.

