మానవ జీవన యానంలో కొత్త పోకడలు, కొంగొత్త మోసాలు, సభ్య సమాజాన్ని నివ్వెరపరిచే నయా వేధింపులు… ఇలా ఒక్కటేమిటి నిత్యం ఎక్కడో ఒక చోట ఈ తరహా సరికొత్త ఘటనలు నమోదు అవుతున్నాయి. ఈ తరహా ఘటనల్లో ఓ సారి మగాడు చనిపోతుంటే… మరోసారి ఆడవారు బలైపోతున్నారు. వెరసి ఆడ, మగల మధ్య స్నేహం, ప్రేమల్లో దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఓ కొత్త ఘటనలో మగాడు మృగాడిగా మారిపోగా… అభం శుభం తెలియని యువతి అతడి వేధింపులకు ప్రాణాలు వదిలేసింది.
ఏపీలోని విజయనగరం జిల్లా గరివిడి మండలం తొండంగ్రి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే… గ్రామానికి చెందిన రాము నాయుడుకు ఇప్పటికే వివాహం అయ్యింది. అయినా అతగాడి ఆడాళ్ల వేట ఆగలేదు. గ్రామానికి చెందిన అవివాహిత అఖిలతో మాట కలిపాడు. స్నేహం మొదలెట్టాడు. ఆ స్నేహాన్ని కాస్త ప్రేమ దాకా తీసుకెళ్లాడు. తరువాత పాటు వీరి ప్రేమ అలాగే కొనసాగింది.
ఈ ప్రేమ ఎంతగా ముదిరినా… పెళ్లైన రాము నాయుడిని అఖిల పెళ్లి చేసుకోలేదు కదా. అందుకే ఆమె కుటుంబ సబ్యులు ఆమెకు ఇంకో వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేశారు. గురువారం ఈ పెళ్లికి సంబందించిన నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అఖిల మరో యువకుడిని పెళ్లి చేసుకుంటోందన్న విషయం తెలిసినంతనే రాము నాయుడులోని మృగాడు నిద్ర మేల్కొన్నాడు. పెళ్లైన తనను ప్రేమించి… ఇంకో యువకుడిని ఎలా పెళ్లి చేసుకుంటుందంటూ అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు.
అంతే తనను ప్రేమించి ఇంకెవరితోనో పెళ్లి ఎలా చేసుకుంటావని అతడు అఖిలను నిలదీశాడు. తనను కాదని ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఒప్పుకునేది లేదని తేల్చేశాడు. ఇప్పటికే పెళ్లి చేసుకున్న నిన్ను తాను ఎలా పెళ్లి చేసుకోవాలంటూ అఖిల కూడా అడగ్గా… అయితే చనిపోయా అంటూ అతడు ఓ దారుణమైన నియమాన్ని ఆమె ముందు పెట్టాడు. తన మాట ప్రకారం చనిపోకపోతే… మన విషయం అందరికీ చెప్పి నిశ్చితార్థాన్ని రద్దు చేస్తానని బెదిరించాడు. అదే జరిగితే… తన కుటుంబం పరువు బజారున పడుతుందని భయపడ్డ అఖిల.. రాము నాయుడు చెప్పినట్టుగా పురుగుల మందు తాగేసింది.
సమాచారం అందుకున్న అఖిల కుటుంబ సభ్యులు ఆమె హుటాహుటిన ఆసుపత్రికి వచ్చారు. అయితే ఆమె తీసుకున్న పురుగుల మందు పరిమితికి మించినది చికిత్స తీసుకుంటూనే ఆమె బుధవారం మరణించింది. ఈ కోరిక అసలేం జరిగిందన్న విషయాన్ని తెలుసుకున్న అఖిల కుటుంబం రాము నాయుడుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరి యువతి ప్రాణాన్ని, ఆమె కుటుంబ పరువును బజారున పడేసిన రాము నాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న విషయం తేలాల్సి ఉంది.

