ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ శనివారం రాత్రి తమ ఎదుట లొంగిపోయిన భగీరథ్ ను పోలీసులు మేడ్చల్ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులను పరిశీలించిన న్యాయమూర్తి భగీరథ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.
మైనర్ బాలికతో అసభ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో భగీరథ్ పై ఫేట్ బహీరాబాద్ పోలీసులు పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అనంతరం తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు భగీరథ్‌కు నోటీసులు జారీ చేశారు.
అయితే ఈ కేసులో తన తప్పేమీ లేదని వాదించిన భగీరథ్, ఆయన కుటుంబ సభ్యులు కేసుకు సంబంధించిన పలు వివరాలను న్యాయవాదుల ఎదుట పెట్టి కేసును సమగ్రంగా పరిశీలించారు. ఈ పోలీసు విచారణకు హాజరు అయ్యే విషయంలో భగీరథ్ ఒకింత జాప్యం చేశారు.
అయితే కేసు తీవ్రమైనదైనా పోలీసుల విచారణకు భగీరథ హాజరు కాని నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నట్లు పలు వార్తా కథనాలు వెలువడ్డాయి. మరోవైపు పోలీసుల నోటీసుల గడువు ముగిసి వారం రోజులు కావస్తున్న నేపథ్యంలో భగీరథ శనివారం రాత్రి లొంగిపోయారు.
ఈ సందర్భంగా ఈ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు భగీరథ్ ను రెండు గంటల పాటు విచారించారు. అనంతరం ఆయనకు మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాత న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.

