రాజకీయాలలో నాయకులు, కార్యకర్తలు.. పార్టీలకు బలమే. దీనిని ఎవరూ కాదనరు. కానీ, సంఖ్యా బలం ఉంటే సరిపోదు.. అధినేత వేసే అడుగులు.. తీసుకునే నిర్ణయాలు.. చేసే వ్యూహాలను కూడా.. కార్యకర్తలు నాయకులు అర్ధం చేసుకోవాలి. ఇది అర్ధం కానంత వరకు ఏ పార్టీ కూడా.. ముందుకు సాగే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం రాష్ట్రంలో జనసేన పార్టీకి కావాల్సినంత మంది కార్యకర్తలు ఉన్నారు. వారు.. పవన్‌పై అభిమానంతో ఉన్నారా? లేక.. పార్టీపై అభిమానంతో ఉన్నారా? అనేది ప్రశ్న.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా సంతరించుకున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు.. టీవీకే అధినేత సీఎం విజయ్ రాజకీయాలను ఆయన ప్రస్తావించారు. నేరుగా పేరు పెట్టి చెప్పకపోయినా. కేవలం కటౌట్లు పెట్టి.. అధికారంలోకి వచ్చారని అన్నారు. అయితే.. పవన్ చెప్పినట్టు కేవలం కటౌట్లతోనే విజయ్ రాలేదు. బలమైన కార్యకర్తల విశ్వాసం కనిపించింది. ఎలాగైనా మా నాయకుడు ముఖ్య మంత్రి కావాలన్న కసి కూడా ఉంది.
ఈ పరిణామాల ను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించిన విజయ్ సక్సెస్ అయ్యారు. ఇక్కడ కూడా.. జనసేనను అభిమానించే కార్యకర్తలు.. పవన్‌కు కటౌట్లు పెట్టే కార్యకర్తలు లేకపోలేదు. కానీ, అర్ధం చేసుకోవటంలోనే వెనుకబడుతున్నారు. టీడీపీతో జనసేన ఎందుకు కూటమిగాందని ప్రశ్నిస్తే.. ఇప్పటికీ.. చాలా మంది జగన్‌ను ఓడించేందుకే అని అంటున్నారు. కానీ.. వాస్తవంలో ఇది పావు వంతే. భిన్నమైన రాజకీయాలు ఉన్న ఏపీలో పార్టీపరంగా బలంగా నిలడుకునే ప్రయత్నం అన్న భావన కనిపించాలి.
ఈ విషయాన్నే పవన్ పదే పదే చెబుతున్నారు. ఇక, పార్టీ అధికారంలోకి వచ్చేస్తుందనే అనుకునే వారు కూడా ఉన్నారు. కానీ.. సహజ రాజకీయాలను గమనిస్తే.. తమిళనాడుకు ఏపీకి మధ్య కులాల కుంపట్ల తేడా కనిపిస్తుంది. దీనిని కూడా అర్ధం చేసుకోవాల్సిన జనసైనికులు వెనుకబడుతున్నారు.
ఎక్కడైనా కూడా.. అధినేత అడుగు జాడల్లో నడవడం వేరు… ఆయన వ్యూహాలను అర్ధం చేసుకోవడం వేరు. నిజానికి ప్రస్తుతం టీడీపీ, జనసేనలో చాలా స్వేచ్ఛ ఉంది. కార్య కర్తల నుంచి నాయకుల వరకు వారి అభిప్రాయాలు పంచుకునే అవకాశం కూడా ఉంది. దీనిని సద్వినియోగం చేసుకుని.. పవన్ అభిప్రాయాలను అర్ధం చేసుకుంటేనే.. జనసేనాని అర్ధమవుతాడు.

