– ప్రకటన –
నవతెలంగాణ-హైదరాబాద్: గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల తీవ్ర నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా గద్వాల జిల్లా ఎర్రవల్లి గ్రామానికి చెందిన నీట్ విద్యార్థిని ఇందు మృతి చెందడాన్ని సిపిఐ(ఎం) తీవ్రంగా ఖండించింది. వైద్యుల తప్పును కప్పిపుచ్చుకోవడానికి పోస్టుమార్టం నిర్వహించకుండా, దొడ్డిదారిన అంబులెన్స్‌లో శవాన్ని తరలించడం ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉంది. కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన విద్యార్థిని శవంగా మార్చి కుటుంబ సభ్యులకు అప్పగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై తక్షణమే స్పందించి విద్యార్థిని ఇందు మృతికి కారణమైన నిర్లక్ష్యపు డాక్టర్లను ప్రభుత్వం వెంటనే డిస్మిస్ చేయించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఆసుపత్రి పర్యవేక్షణ, ఇలాంటి అంశాలలో గతంలో కూడా విఫలమై అనేక మరణాలకు కారణమైన గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ ను వెంటనే విధుల నుండి సస్పెండ్ చేయాలి. ఇందు కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఎక్స్ గ్రేషియో ప్రకటించాలి. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించి ప్రభుత్వం ఆదుకోవాలి.
తమ బిడ్డను కోల్పోయి న్యాయం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులను, ఎర్రవల్లి గ్రామస్తులకు మద్దతుగా నిలిచిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి మరియు ప్రజాసంఘాల నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ధరూర్, గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్లలో ఉంచిన నాయకులను, బాధితులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని సిపిఐ(ఎం) డిమాండ్ చేసింది.
– ప్రకటన –

