ఏపీ రాజకీయాల్లో మళ్లీ వేడి రాజుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై మరోసారి అనుమానాలు వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల అనంతరం మూడు రోజులకే వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని జగన్ తెలిపారు. “అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు అన్నారు. ఆ వ్యాఖ్యల తర్వాతే ప్రమాదం జరిగింది” అని చెప్పారు. వైఎస్సార్ మరణంపై అనేక ప్రశ్నలు, అనుమానాలు ఉన్నాయని ఆయన ఇప్పటికీ ఉన్నారు.
తన కుటుంబంలో జరిగిన ఇతర ఘటనలను కూడా జగన్ ప్రస్తావించారు. తన తాత రాజారెడ్డి హత్య కేసు గుర్తుచేస్తూ టీడీపీ నేతలపై పరోక్ష ఆరోపణలు చేశారు. అలాగే తన చిన్నాన్న హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి వ్యవహారంపై కూడా వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర రాజకీయాల్లో హింసాత్మక ధోరణులు, “గన్ కల్చర్” పెరిగిందని ఆరోపిస్తూ టీడీపీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. బాలకృష్ణ ఘటనను ప్రస్తావిస్తూ “ఎవరిది గన్ కల్చర్ చంద్రబాబూ?” అంటూ ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలో “శవ రాజకీయాలు ఎవరివి?” అన్నదానిపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు.
రెండేళ్ల పాలనలో రాష్ట్రంలో “జంగీ కూటమి రాజ్” నడుస్తోందని జగన్. ప్రజల మధ్య విభేదాలు సృష్టించే డైవర్షన్ రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన తండ్రి వైఎస్సార్ ఇచ్చిన విలువ అని ఆ మార్గంలోనే తాను రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పారు.

