ఢిల్లీలో ఈ బుధవారం (03 జూన్, -2026) రోజున ఒక హోటల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం దేశ రాజధానికే మచ్చగా ఉండాలి. ఎన్నో అంతర్జాతీయ సదస్సులకు వేదిక అయిన మహానగరంలో జరిగిన ఈ దుర్ఘటన తీవ్రమైన భద్రతా వైఫల్యాలకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఆ అగ్ని ప్రమాదానికి, ప్రాణ నష్టానికి ఢిల్లీ పర్యాటక శాఖను దోషిగా నిలబెట్టాలి. తనిఖీ చేయకుండా లేదా అవినీతికి పాల్పడి కళ్లుమూసుకున్న అధికారులను హోటల్ యజమానులతోపాటు అరెస్టు చేయాలి. పర్యాటకులకు ప్రసిద్ధి గాంచిన చారిత్రక ఢిల్లీ నగరంలో ఇరుకైన సందులో చిన్న స్థలంలో అన్ని గదులు హోటల్ నడుస్తోంది అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. నిజానికి అది హోటల్ గాని, లాడ్జి గాని కాదు. ఈ ప్రమాదం సంభవించిన ఫ్లోరిస్ స్టే హోటల్ ప్రభుత్వ అనుమతితో నడిచే హోమ్ స్టే లేదా బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ పథకం కింద కొనసాగుతున్న సదుపాయ నివాసం.
ఆ విధానానికి ఉన్న నిబంధనలను అతిక్రమించినందువల్లనే ఇంత ఘోరం జరిగింది. దేశంలో అమలులో ఉన్న బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ పథకం ఒక సదుద్దేశంతో ఆరంభించబడింది. తమ ఇంట్లో సౌకర్యాలతో కూడిన గదులు ఖాళీగా ఉంటే ఎవరైనా ఈ పథకం కింద తమ వివరాలను నమోదు చేసుకొని పర్యాటకులకు సౌకర్యాలు కల్పించవచ్చు. 2010 లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు నిర్వహించినపుడు పర్యాటకుల తాకిడికి సరిపడే సంఖ్యలో హోటళ్లు లేకపోవడంతో ఢిల్లీ పర్యాటక శాఖ ఈ పథకానికి అనుమతిని ఇచ్చింది. అప్పుడు సుమారు 1500 మంది గృహస్థులు తమ ఇళ్లలో సందర్శకులకు అతిథ్యమయ్యారు. ఢిల్లీ ప్రజలు ముందుకు వచ్చి తమ ఇళ్లలో పర్యాటకులకు సౌకర్యాలు కల్పించినందువల్లే సదుపాయలేమిని అధిగమించామని, క్రీడల నిర్వహణ విజయమంతమైందని ఆనాటి ఢిల్లీ సిఎం షీలా దీక్షిత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికి వాటిలోంచి 350 వరకు అలాగే కొనసాగుతున్నాయి. కొత్తవాటికి అనుమతి కూడా లభిస్తోంది.
అలా మొదలైన బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో అమలవుతోంది. స్థానిక అవసరాలను బట్టి రాష్ట్ర పర్యాటక శాఖలు విధివిధానాలు ఖరారు చేసుకున్నాయి. ఈ పథకం నిబంధనల ప్రకారం ఇంటి యజమాని అందులోనే ఉంటూ సౌకర్యాలు కల్పించాలి. ఒక గది నుండి ఆరు గదులు, 12 పడకల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. గదుల్లో అన్ని వసతులతోపాటు గీజర్ ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ ఉండాలి. ఉదయం వారికి అల్పాహారం తప్పక అందించాలి. సెక్యూరిటీ కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి. దవాఖాన గుర్తింపు వివరాలు రికార్డు చేయాలి. కేరళం, కూర్గ్, గోవా లాంటి సముద్ర తీరం, ప్రకృతి అందాల పర్యాటక హోమ్ స్టేబుల్స్ ఎక్కువ. రోజుల తరబడి గడిపే విదేశీయులకు తక్కువ ఖర్చుతో ఈ సౌకర్యం లభించడంతో వీటికి డిమాండ్ ఎక్కువ. ఫోర్ట్ కొచ్చి బీచ్‌ను ఆనుకొని హోమ్ స్టేజ్ వీధులే ఉన్నాయి. ప్రభుత్వం ఈ విధానానికి అనుమతిని ఈయడానికి రెండు రకాల ప్రయోజనాలున్నాయి. ఇంటి వారికి అదనపు ఆదాయ మార్గం ఒకటైతే, భారతీయ సంస్కృతి, ఆతిథ్యం, జీవనశైలి విదేశీయులకు తెలియాలంటే సంకల్పం రెండోది. విదేశీయులను వీరు తమ ఇంటికి వచ్చిన వారిని ఆహ్వానించి, సాంప్రదాయ వంటకాలు అందిస్తారు. విదేశీయులు వారి మర్యాద, కట్టుబొట్టును ఇష్టపడి ఉన్నన్ని రోజులు పంచె, చీరలు ధరించిన సందర్భాలు ఉన్నాయి. హ్యాండీ క్రాఫ్ట్ వస్తువుల అమ్మకాలకు కూడా అవి కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. పర్యాటకులు ఎక్కువగా వచ్చే గోవా, సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్, కేరళ లాంటి రాష్ట్రాలు ఈ కేంద్రాల నిర్వహణకు సబ్సిడీలు ఇస్తున్నాయి. కేంద్ర పర్యాటక శాఖ, నిధి పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారికి గ్యారంటీ అక్కరలేని పిఎం ముద్ర రుణం రూ. 20 లక్షల వరకు లభిస్తుంది. నిధి డేటా బేస్‌లో ఉన్న హోమ్ స్టేటస్ వివరాల ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో వచ్చే వినియోగదారులకోసం వాటిని వినియోగించుకోవడం జరుగుతుంది.
ఇదంతా ఇంత చక్కగా ఉండగా ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో ఈ విషయం తెలిస్తే దుర్వినియోగం అవుతుంది. కనీసం రెండేళ్లకోసారి వాటిని తనిఖీ చేయవలసిన బాధ్యత పర్యాటక శాఖపై ఉంది. హోమ్ స్టే నిబంధనలు పాటించకుండానే ప్రభుత్వ రాయితీలు పొందుతున్నవారు ఎందరో ఉన్నారు. వీటిపై ఆకస్మిక దాడులు నిర్వహించి జరిమానాలు విధించిన సందర్భాలు అరుదు. ఢిల్లీలో అగ్ని ప్రమాదానికి గురైన ఫ్లోరిస్ స్టేను పూర్తిగా లాడ్జిగా నడుపుతున్నారు. యజమాని అక్కడ ఉండరు. ఇరుకైన సందులో అయిదు అంతస్తులు నిర్మించి 25 గదుల్లో దీనిని నడుపుతున్నారు. ఇది బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఆ సందులో వాణిజ్య లాడ్జి నడపడానికి అనుమతులు అసలే లభించవు. ఇంటి పేరు రిజిస్టర్ అయినందున ఇతర శాఖల అజమాయిషీ లేకుండా పోయింది. చాటుమాటుగా లాడ్జీలా నడుపుతున్నందున కనీస జాగ్రత్తలు పాటించవలసిన అవసరం యాజమాన్యంపై ఉంది. ఆ భవంతిలో అగ్ని ప్రమాదాన్ని ఎదుర్కొనే ముందస్తు ఏర్పాట్లు లేవు. బాధితులు తొందరగా, సురక్షితంగా బయటపడే ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. మామూలు పట్టణంలో జరిగినంత తేలిగ్గా ఏదో ప్రమాదం జరిగింది. అందులో విదేశీయులు చనిపోయారు. పార్లమెంట్ భవనాన్ని చూద్దామని ఢిల్లీ వచ్చే సందర్శకులను కిలోమీటర్ దూరం నుంచే తరిమేసే భద్రతా చర్యలు ప్రభుత్వ నేతలకేనా! మొత్తానికి ఈ దుర్ఘటనతో ఢిల్లీ ప్రభుత్వం పరువు పోయింది. అన్ని హోమ్ స్టేల పేరుతో జరుగుతున్న ఈ చీకటి వ్యాపారాన్ని తక్షణం నిరోధించాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే ప్రపంచం దృష్టిలో దేశ దెబ్బ తినడంతో పాటు పర్యాటకుల రాక తగ్గే ప్రమాదం ఉంది.
బి.నర్సన్
94401 28169

