Published on: 4:27 pm, 26 జూన్ 2026
తెలంగాణలో కీలక ఓ నియామకానికి సంబంధించిన నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును నియమించారు. ఈ మేరకు శుక్రవారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 30న ప్రస్తుత ఎస్ఎస్ రామకృష్ణారావు పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజున కొత్త సీఎస్ గా జాజు పదవీ బాధ్యతలు చేపడతారు.
సంజయ్ జాజుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ కి చెందిన ఈయన తొలుత విజయవాడ సబ్ కలెక్టర్ గా తన సర్వీస్ ను గుర్తించారు. ఉమ్మడి ఏపీలో మీ సేవ సర్వీసుల అమలులో ఈయన కీలక భూమిక పోషించారు. రాష్ట్ర విభజనకు ముందే అందుబాటులోకి వచ్చిన మీ సేవ ప్రజలకు మెరుగైన రీతిలో ప్రభుత్వ సర్వీసులు అందజేస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కేడర్ ను ఎంపిక ఈయన 2014లోనే కేంద్ర సర్వీసులకు డిప్యూటేషన్ పై వెళ్లారు. మోదీ సర్కారు అమలు చేసిన ఆత్మ నిర్భర భారత్ పథకం రూపకల్పన, అమలులో జాజు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మీ సేవ, ఆత్మ నిర్భర భారత్ పథకాల పేరు వింటేనే జాజు గుర్తుకు వచ్చేలా వ్యవహరించారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్రం ఆయనను తిరిగి తెలంగాణ కేడర్‌కు బదిలీ చేసింది.
తెలంగాణ కొత్త సీఎస్ గా మరో సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ పేరు బలంగా వినిపించినా… ఆయన పట్ల సీఎం రేవంత్ రెడ్డి అంత ఆసక్తిగా చేపలేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగానే రంజన్ బ్యాచ్‌కు చెందిన జాజును కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి తిరిగి రప్పించి మరీ ఎస్ఈఎస్ పదవిని అప్పగించారన్న వాదన వినిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రంజన్ బాధ్యతలు నిర్వర్తించారు. పరిశ్రమలు, ఐటీ శాఖల కార్యదర్శిగా వ్యవహరించిన రంజన్… కేటీఆర్ తో అత్యంత సన్నిహితంగా మెలిగారన్న వాదనలూ వినిపించాయి. ఈ కారణంగానే అందుబాటులో ఉన్న రంజన్ ను కాదని… సెంట్రల్ సర్వీస్‌లలో ఉన్న జాజును రాష్ట్రానికి రప్పించారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

