మెహిదీపట్నం, వెలుగు: ఆషాఢమాస బోనాల జాతర ఈ నెల 16 నుంచి మొదలుకానున్నది. గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడం ఆనవాయితీ కావడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు నిర్వహించే తొలి బోనంతో నగర వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. గురువారం 28 కులవృత్తుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా రెండు పచ్చి మట్టి కుండల్లో నజర్ బోనాలను తయారు చేస్తారు. వీటిలో ఒక బోనాన్ని జగదాంబ అమ్మవారికి, మరొకటి మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు.
లంగర్ హౌస్లో ధూంధాం
గురువారం లంగర్ హౌస్ చౌరస్తా వద్ద దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భారీ తొట్టెల వేడుక ఏర్పాటు చేస్తారు. తర్వాత లంగర్ హౌస్ నుంచి ఊరేగింపు మొదలై కళాకారుల ఆటపాటలు, డప్పు వాయిద్యాల మోతతో బడా బజార్ మీదుగా కోటపైకి చేరుకుంటుంది. అక్కడ అమ్మవార్లకు మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించి, నజర్ బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కాగా, మన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి శ్రీ జగదాంబ మహంకాళి (ఎల్లమ్మ తల్లి) దేవాలయ బోనాల ఉత్సవాల కమిటీ చైర్మన్ ఆకుల చంద్రశేఖర్.
ప్రతి ఆది, గురువారాల్లో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 16న ఉత్సవాలు ప్రారంభమవుతాయని, రెండో పూజ 19న, మూడో పూజ 23న , 26న నాలుగో పూజ ఉంటుందన్నారు. 30న ఉదయం 10.30 గంటలకు చండీహోమం జరుపుతామని, ఆరో పూజ ఆగస్టు 2న, ఏడో పూజ అయిన 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు అమ్మవారి పల్లకీ సేవ నిర్వహించారు. ఎనిమిదో పూజ 9న, చివరిదైన తొమ్మిదో పూజ నిర్వహించే ఆగస్టు 13న అమ్మవారి సమరోహణ కుంభహారతితో ఉత్సవాలు ముగుస్తాయి.

