విశాలాంధ్ర – కంబదూరు..కంబదూరు ఓబగానపల్లి గ్రామం నుంచి మండల కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సుమారు 15 సంవత్సరాల క్రితం కోట్లాది రూపాయల ప్రజాధనంతో 12 ఏళ్ల పొడవున తారురోడ్డు నిర్మించారు. అయితే గాలిమరల నిర్మాణ పనుల సమయంలో భారీ వాహనాల రాకపోకలు అధికంగా సాగడంతో రహదారి పూర్తిగా దెబ్బతింది.ప్రస్తుతం రహదారిపై తారు పూర్తిగా ఊడిపోయి కంకర తేలిన పరిస్థితి ఏర్పడడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యపై సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామ గ్రామాలకు రోడ్లు వేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సభల్లో హామీలు ఇస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉందని ప్రజలు మండిపడుతున్నారు. వర్షాకాలంలో గుంతలు కనిపించక వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గుర్తించాల్సిన పరిస్థితి.ముఖ్యంగా కుందుర్పి–కంబదూరు మండలాలను కలిపే కీలక లింక్ రోడ్ కూడా ఓబగానపల్లి గ్రామం మీదుగా ఉండడంతో ఈ రహదారి మరమ్మతులు అత్యవసరంగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.“ఈ రోడ్డుకు మహర్దశ ఎప్పుడొస్తుందో?” అంటూ గ్రామ ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.

