OTR: తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ బాగా సీరియస్‌గా ఉన్నారా? ఇక మాటల్లేవ్…. మాట్లాడుకోవడాల్లేవ్…. డైరెక్ట్‌గా తేల్చుకోవడాలేనని డిసైడయ్యారా? ఆ దిశగానే గ్రౌండ్‌వర్క్ జరుగుతోందా? ఏ విషయంలో గుత్తా అంత గుస్సా అయ్యారు? ఆయన కోపానికి గత అనుభవాలు కూడా కారణమేనా? ఛైర్మన్ యాక్షన్ ఎలా ఉండబోతోంది?
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రోటోకాల్‌లు రచ్చకు దారి తీస్తున్నాయి. తాజాగా… శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి మరోసారి ఇబ్బందికరంగా మారడం చర్చనీయమైంది. ఈసారి గతం కంటే, బాగా సీరియస్‌గా ఉన్నారట ఆయన. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి మండలి చైర్మన్ హోదాలో గుత్తా సిద్ధమవుతున్నారన్న సంగతి ఆసక్తికరంగా మారింది. తాజా వ్యవహారం ఏకంగా ముఖ్యమంత్రి నల్గొండ టూర్లోనే జరగడంతో సీరియస్‌నెస్ పెరిగిందని అంటున్నారు.
గుత్తా ప్రోటోకాల్ వివాదం జిల్లాలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. గతంలో రెండు, మూడుసార్లు ఇలాంటివే జరిగినా… ఈసారి మాత్రం అస్సలు ఉపేక్షించకూడదని అనుకుంటున్నారట చైర్మన్. గతంలో కూడా ప్రోటోకాల్ పాటించని జిల్లా అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ… ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవడం, జిల్లా అధికారులు కూడా నేరుగా ఆయన్ని కలిసి అసలేం జరిగిందో చెప్పి… ఏ పరిస్థితుల్లో వారు అలా చేశామో వివరించడంతో కన్విన్స్ అయ్యారు సుఖేందర్‌రెడ్డి. అప్పటికి ఆ వివాదం సద్దుమణగ్గా… ఏడాది నుంచి ఎలాంటి ప్రోటోకాల్ వివాదాలకు తావు లేకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. కానీ తాజాగా నల్లగొండ నియోజకవర్గంలో సీఎం పర్యటన సందర్భంగా రోడ్లు, భననాల శాఖ జారీ చేసిన ప్రకటనల్లో గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో మిస్ కావడం మరోసారి ఆయన ఆగ్రహానికి కారణమైంది. అధికారిక కార్యక్రమంలో అధికారుల నిర్లక్ష్యంపై మండలి ఛైర్మన్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంబందిత అధికారులకు నోటీసులు ఇచ్చేందుకు రంగంసిద్దం చేసినట్లు తెలిసింది. ప్రోటోకాల్ ఉల్లంఘన వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దల దగ్గరే తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారట. ఈసారి నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో… ఈ మొత్తం వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం కూడా సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఎందుకు అలా జరిగింది…? నిర్లక్ష్యం ఎవరిది?
తప్పిదానికి కారకులు ఎవరన్న కోణంలో సీఎంవో ఆరా తీసిందట. ఇలాంటి ఘటనలు మరోమారు జరగకుండా చర్యలు తీసుకుంటామని మండలి ఛైర్మన్‌కు అంతకుముందే సర్దిచెప్పారట ప్రభుత్వ పెద్దలు. ప్రోటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించి జిల్లాపై ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయినట్టు తెలిసింది. అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట ఆయన. ఏకంగా ముఖ్యమంత్రి పర్యటనలోనే ప్రోటోకాల్ ఉల్లంఘనలు ఏంటని జిల్లా అధికారులందరికీ గట్టిగానే క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో ఇక్కడ ప్రోటోకాల్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా తయారైందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోందట.
కరవమంటే కప్పకు కోపం. విడవమంటే పాముకు కోపం… అన్నట్లుగా తయారైందని అంటున్నారు. అధికారిక కార్యక్రమాల్లో కీలక నేతల ముఖ్య అనుచరుల అతి జోక్యం వల్లే ఈ తలనొప్పులు అన్నది అధికారుల వర్షం. ఎవరి పని వాళ్లను చేసుకోనిస్తే ఇటువంటి పొరపాట్లు, అవమానాలు జరగవని అంటున్నారు. ఇక తాజాగా సీఎం పర్యటనకు సంబంధించి అధికారికంగా ఇచ్చిన ప్రకటనల్లో శాసనమండలి ఛైర్మన్ ఫోటో మిస్ కావడానికి సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆ శాఖ అధికారులను ప్రభావితం చేసే కొందరు అధికారపార్టీ నేతల అత్యుత్సాహం వల్లే ఇంతటి వివాదం రేగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే తన అనుభవానికి, హోదాకు సరైన ప్రయారిటీ దక్కడం లేదని మధనపడుతున్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి… తాజాగా ప్రోటోకాల్ ఉల్లంఘనల వ్యవహారం పుండు మీద కారం చల్లినట్లు అయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

