తెలుగు రాష్ట్రాల్లో మేధావుల తీరు భలేగా ఉంటుంది. సాపేక్షంగా విశ్లేషణలు చేస్తే.. స్వార్థంతో చేసినట్లే కనిపించేటోళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే.. లెఫ్ట్.. లేదంటే రైట్ కాకుండా.. ఉన్నది ఉన్నట్లుగా ఎందుకు విషయాలను వివరించలేదు? అన్నది పెద్ద ప్రశ్న. అయితే చంద్రబాబు.. పవన్ ను తిట్టాలి. లేదంటే కేసీఆర్.. జగన్ ను నోటికి వచ్చినట్లు అనేయాలి. వీరిలో కొందరు రేవంత్ ను వెనకేసుకొస్తే.. మరికొందరు విరుచుకుపడతారు. మొత్తంగా సాపేక్షంగా అభివృద్ధిని ప్రదర్శించే ప్రక్రియ తెలుగు రాష్ట్రాల్లోని మేధావుల్లో తక్కువగానే చెప్పాలి.
అత్యంత విశ్వసనీయ సమాచారం.. అందుకే పవన్ పరువు తీసే విషయాలు.. చెప్పక చెప్పక ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే పెద్ద మనిషికి జనసేన కోర్ కమిటీలో ఉన్నోళ్లు చెబుతారా? అన్నది అసలు ప్రశ్న. అత్యంత విధేయులకు.. నమ్మకస్తులకు బాధ్యతలు అప్పజెప్పే పవన్ కల్యాణ్.. అంతలా ఎంపిక చేసుకున్న వారు.. నాలుగు గోడల మధ్య చెప్పిన విషయాల్ని.. చెప్పక చెప్పక ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ కే వెతుక్కుంటూ వెళ్లి చెబుతారా?అన్నది ప్రశ్న. ఇంతకూ పవన్.. అమిత్ షాను వెళ్లి కలిసినప్పుడు.. వారితో పాటు నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.
వారంతా కూర్చున్నప్పుడు.. జగన్ ను అరెస్టు చేయాలని పవన్ అడిగితే.. అందుకు అమిత్ షా సూచన.. ఎందుకు జగన్ తో అనవసరమైన పంచాయితీ.. వెళ్లి కలవు అని ఉపదేశించినట్లుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ కు జనసేనకు చెందిన వారు చెప్పినప్పుడు.. వైసీపీకి చెందిన వారు సారుకు చెప్పరా? అన్నది ప్రశ్నగా మారుతుంది.
జగన్ తో పంచాయితీ ఎందుకు? దీర్ఘకాలం పనికి వచ్చే స్నేహితుడిగా జగన్ ను చూడు.. లాంటి మాటలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అమిత్ షా చెప్పారన్నది ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉవాచ. అలానే జరిగితే.. గతంలో పవన్ తో అనవసరమైన పగలు వద్దు అలా చెప్పి ఉంటారా సార్?
ఎందుకంటే పవన్ కల్యాణ్ అనేటోడు వర్తమానంలోనే కాదు.. భవిష్యత్తులోనూ స్నేహితుడు. జగన్ భవిష్యత్తులో మిత్రుడు అయినప్పుడు.. తన ఇద్దరు భవిష్యత్తు స్నేహితులను కలిపి ఉండటమే బీజేపీ గేమ్ ప్లాన్ అవుతుంది కదా? అలా కాకుండా జగన్ తో తనకు ఉన్న మైత్రే కానప్పుడు.. పవన్ ను జగన్ తో బాగుండాలని.. అతడి మీద అరెస్టుల పర్వం వరకు వెళ్లకూడదని ఎందుకు చెబుతారు?
ప్రొఫెసర్ నాగేశ్వర్ కు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్ తో పవన్ మంచి బంధాన్ని సాగించాలని కోరితే.. అంతేలా జగన్ కు కూడా అమిత్ షా కానీ మోడీ కానీ పవన్ తో పేచీలు పెట్టుకోకుండా ఉండాలని చెప్పి ఉండాలి కదా?
అలా చెప్పి ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రొఫెసర్ గారికి ఎందుకు అందలేదు? నిజానికి జనసేనతో.. వైసీపీతోనే ప్రొఫెసర్ నాగేశ్వర్ కు సత్సంబంధాలు ఉన్నాయన్న విషయం ప్రపంచానికి తెలిసిందే. అలాంటప్పుడు జనసేన నుంచి అందిన విశ్వసనీయ సమాచారం.. వైసీపీ అగ్రనాయకత్వం నుంచి పక్కాగా అందుతాయి కదా?
అంటే.. ప్రొఫెసర్ నాగేశ్వర్ తనకు అందే విశ్వసనీయ సమాచారాల విషయంలో ఫిల్టర్లు వాడుతున్నారా? తన వ్యూహానికి తగినట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారా?అన్నదిప్పడు ప్రశ్నలు. ఇలాంటి వాటికి వాళ్లు.. వీళ్ల కంటే ప్రొఫెసర్ సార్ స్పష్టత ఇస్తే బాగుంటుంది. ఏమంటారు?

