మధ్యమహేశ్వర దేవాలయం: భారతదేశంలోని ఆలయాలకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. కొన్ని ఆలయాలు సహజసిద్ధంగా ఏర్పడితే ప్రకృతి. అయితే దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కొన్ని ఆలయాల్లో విశేష చరిత్ర దాగి ఉంది. అలాంటి వాటిలో ఆలయ పంచ కేదారాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ పంచ కేదారాల్లో మధ్య మహేశ్వర్ ఆలయం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆలయంలో శివుడు నాభి రూపంలో దర్శనం ఇస్తాడు. ఇలా ప్రత్యేకంగా దర్శనం ఇవ్వడం వెనుక పురాణ గాథ దాగి ఉంది. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రసిద్ధ ఆలయాలు కొలువైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 3,497 మీటర్ల ఎత్తులో ఉన్న పవిత్ర శైవ క్షేత్రమే మధ్యమహేశ్వర దేవాలయం. హిమాలయ పర్వతాల నడుమ ప్రకృతి సోయగాల మధ్య వెలసిన ఈ ఆలయం పంచ కేదారాల్లో రెండవదిగా కనిపిస్తుంది. ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలు, పురాణ ప్రాశస్త్యం కలిసిన ఈ క్షేత్రం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది.
శివుడి జాడ కోసం..
హిందూ పురాణాల ప్రకారం.. మహాభారత యుద్ధం అనంతరం వారికి అంటుకున్న పాప విమోచనం కోసం పాండవులు పరమశివుడి దర్శనం కోరుకున్నారు. అయితే వారిని కలవడానికి ఇష్టపడని శివుడు వృషభం (ఎద్దు) రూపంలో హిమాలయాలకు వెళ్లాడని కథనం. పాండవులు ఆయనను గుర్తించడంతో శివుడు భూమిలోకి అంతర్ధానం అయ్యాడు. ఆ సమయంలో ఆయన శరీర భాగాలు ఐదు ప్రాంతాలలో ప్రత్యక్షమయ్యాయని, ఆ ప్రాంతాలనే పంచ కేదారాలుగా పూజిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి.
ప్రత్యేక ఆకారంలో..
పంచ కేదారాల్లోని ప్రతి ఆలయం శివుడి ఒక శరీర భాగానికి ప్రతీకగా భావించబడుతుంది. మధ్య మహేశ్వర్‌లో శివుడి నాభి భాగం ప్రత్యక్షమైందని విశ్వాసం. అందువల్ల ఇక్కడి శివలింగం సాధారణ లింగాకారంలో కాకుండా నాభి ఆకృతిని పోలి ఉంటుంది. ఈ విశిష్టత ఈ ఆలయాన్ని ఇతర శైవ క్షేత్రాల కంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. సమీపంలో ప్రవహించే స్వచ్ఛమైన హిమజలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని స్థానికులు విశ్వసిస్తారు. ఈ నీటితో స్నానం చేయడం లేదా తీర్థంగా స్వీకరించడం ద్వారా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక శుద్ధి కలుగుతుంది భక్తులు నమ్ముతారు. మంచు పర్వతాల మధ్య నుంచి ప్రవహించే ఈ జలాలు ఎంతో నిర్మలంగా ఉంటాయి.
ఎలా చేరుకోవాలి?
మధ్య మహేశ్వర్ ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ లేదా హరిద్వార్ చేరుకోవాలి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఉఖిమత్ మీదుగా రాంసీ (రాన్సీ) గ్రామానికి వెళ్లాలి. రాంసీ గ్రామం వరకు వాహనాలు అందుబాటులో ఉంటాయి. రాంసీ గ్రామం నుంచి మధ్య మహేశ్వర్ ఆలయానికి సుమారు 16 నుంచి 18 వరకు మేర ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. మార్గమంతా అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి. గుర్రాలు, ఖచ్చర్లు కూడా ఉంటాయి. సాధారణంగా భక్తులు ఒకటి లేదా రెండు రోజుల ట్రెక్కింగ్ ద్వారా ఆలయానికి చేరుకుంటారు.
ఆరు నెలలు మాత్రమే..
హిమాలయ తీవ్రమైన మంచు కారణంగా ఈ ఆలయం సంవత్సరమంతా తెరిచి ఉండదు. సాధారణంగా మే నెలలో ఆలయ ద్వారాలు తెరుస్తారు. అక్టోబర్ లేదా నవంబర్ వరకు మాత్రమే భక్తులకు దర్శనం లభిస్తుంది. అనంతరం శీతాకాలంలో ఆలయాన్ని మూసివేసి ఉత్సవ విగ్రహాన్ని సమీపంలోకి తరలిస్తారు. అక్కడే శీతాకాల పూజలు నిర్వహించారు.

