రైతుల ఆవేదనకు సమాధానం చెప్పేది ఎవరు సారు?..
విశాలాంధ్ర – నార్పల : మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా, రైతుల అవమానాలు భరించే కేంద్రంగా మారిందన్న విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఆశాజనక పనుల కోసం ఆశతో కార్యాలయానికి వచ్చే రైతులు చివరకు అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది బాధ్యతారాహిత్యంతో విసిగి పోయి నిరాశగా వెనుదిరుగుతున్న దుస్థితి.
“తహసిల్లు వస్తాడో రాడో తెలియదు వచ్చినా ప్రజల వినే పరిస్థితి లేదు… అడిగితే ఒక్కరు సరైన సమాధానం చెప్పరు… ఇది ప్రభుత్వ కార్యాలయమా లేక అనాథాశ్రమా?” అంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కార్యాలయంలో సిబ్బంది కూడా తహశీల్దార్ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకుని తమ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పనుల కోసం వచ్చే ప్రజల గంటల తరబడి కూర్చోబెట్టి చివరకు “రేపు రండి… అధికారి లేరు” అంటూ పంపించేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పట్టాదార్ పాస్‌బుక్‌లు, ఆదాయ ధృవీకరణ పత్రాలు, భూమి మార్పిడి, వారసత్వ నమోదు వంటి అత్యవసర పనులు నెలల తరబడి పెండింగ్‌లో పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతుల సమస్యలపై స్పందించాల్సిన శాఖే రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పుతుండటం బాధాకరమని ప్రజలు అంటున్నారు.
ప్రజల పన్నుల డబ్బులతో జీతాలు తీసుకుంటున్న అధికారులు ప్రజలకు అందుబాటులో లేకుంటే అలాంటి పరిపాలన వల్ల ఉపయోగమేంటని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నార్పల మండలంలో ఆందోళన వెంటనే పూర్తిగా గాడితప్పిందని, శాశ్వత తహశీల్దార్‌ను నియమించకపోతే రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ స్పందించి నార్పల ప్రజల కష్టాలను గుర్తించి పూర్తి స్థాయి తహసిల్దార్‌ను నియమించి కార్యాలయ పరిపాలనను గాడిలో పెట్టాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

