నిద్ర లేమి: ప్రస్తుత కాలంలో ఒత్తిడి, పని భారం, మొబైల్ ఫోన్ల అధిక వినియోగం, అనారోగ్యకర జీవనశైలి కారణంగా రాత్రిళ్లు సరిగా నిద్రపోలేక ఇబ్బంది పడుతున్నారు. అప్పుడప్పుడు నిద్రలేమి సాధారణమే అయినప్పటికీ, ఇది తరచుగా ఎదురైతే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మెదడు ఆరోగ్యంపై దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇందులో భాగంగా నిద్రలేమి సమస్యలు ఎదుర్కొన్న వారిలో డిమెన్షియా ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రతిరోజూ సరిపడా నిద్రపోని వ్యక్తుల్లో డిమెన్షియా (మతిమరుపు వ్యాధి) వచ్చే ప్రమాదం పెరుగుతుందని ‘న్యూరాలజీ’ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం. దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్నవారిలో డిమెన్షియా ప్రమాదం సుమారు 40 శాతం వరకు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వయసు పెరిగే కొద్దీ ఈ ప్రమాదం మరింత ఎక్కువ కావచ్చని వారు భావిస్తున్నారు. సాధారణంగా నిద్ర సమయంలో మెదడు తనను తాను పునరుద్ధరిస్తుంది. రోజంతా సేకరించిన వాటిని క్రమబద్ధీకరించడం, అవసరం లేని వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి పనులు నిద్రలోనే జరుగుతాయి. అయితే నిద్ర సరిగా లేకపోతే ఈ ప్రక్రియలు దెబ్బతింటాయి. మెదడు పనితీరు తగ్గి, మెదడు వయసు నిజమైన వయసుతో 3.5 రెట్లు వేగంగా పెరుగుతున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
నిద్రలేమి కారణంగా జ్ఞాపకశక్తి బలహీనపడటం, ఏకాగ్రత తగ్గడం, తీసుకునే సామర్థ్యం తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడం కష్టంగా మారుతుంది. అలాగే భావోద్వేగాలు కూడా తగ్గి చిరాకు, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. నిద్రలేమి కేవలం మెదడుకే కాదు, మొత్తం శరీరానికీ హానికరం. రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. రోగనిరోధక శక్తి కూడా బలహీనపడటంతో తరచూ అనారోగ్యాలు వచ్చే అవకాశం శరీరంలో ఉంటుంది.
చాలామంది నిద్ర రాకపోతే వెంటనే నిద్రమాత్రల వైపు మొగ్గు చూపుతారు. అయితే వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి వెనుక ఒత్తిడి, ఆందోళన, జీవనశైలి సమస్యలు లేదా ఇతర ఆరోగ్య కారణాలు ఉండవచ్చు. కాబట్టి మూల కారణాన్ని గుర్తించి పరిష్కరించడం ముఖ్యం.
పడుకునే ముందు మనసుకు ప్రశాంతత కలిగించే కథలు చదవడం, ఆడియో స్టోరీలు వినడం, మృదువైన సంగీతం ఆస్వాదించే నిద్రకు సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ధ్యానం, లోతైన శ్వాస వ్యాయామాలు, యోగా వంటి మెదడును రిలాక్స్ చేసి నిద్ర పట్టేలా చేస్తారు.ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. రాత్రి సమయంలో మొబైల్, ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని తగ్గించాలి. కాఫీ, టీ వంటి కెఫిన్ పానీయాలను సాయంత్రం తర్వాత తీసుకోకపోవడం మంచిది. పడకగదిని ప్రశాంతంగా, చీకటిగా ఉంచడం కూడా నిద్రను మెరుగుపరుస్తుంది.

