మన తెలంగాణ/హైదరాబాద్: గత ఏడాది అధిక వర్షాలతో పుంజుకున్న రాష్ట్ర భూగర్భ జలాలు, ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో మళ్లీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. నైరుతి రుతుపవనాలు బలహీనపడటం, రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం లోటు నమోదవడం, జలశయాల్లో ఆశించిన మేర నీటి ని ల్వలు చేరకపోవడం వల్ల భూగర్భ జలాల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడా ది నైరుతి రుతుపవనాల ప్రారంభం నుంచే పరిస్థి తి మారిపోయింది. జూన్ మధ్య నాటికి రాష్ట్రంలో 23 శాతం వర్షపాతం లోటు నమోదవగా, జూలై 14నాటికి 30 శాతం లోటుతో 27జిల్లాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో జూన్ 1వ తేదీ నుంచి ఈ నెల 14వ తేదీ వరకు సాధారణంగా 228 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 158.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు వర్షపాతం 30.53 శాత లోటులో ఉంది. ఎల్నినో ప్రభావం వల్ల భారత సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం, రుతుపవన వ్యవస్థ బలహీనపడటం సాధారణంగా కనిపించే పరిణామం.
రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. జూన్ నెలలో సాధారణంగా 130 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా కేవలం 115 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈ వర్షాల లోటు భూగర్భ జలాల తీవ్రంగా ప్రభావితం చేసింది. రాష్ట్ర భూగర్భ జల శాఖ గత నెలలో 1,771 బావులను పరిశీలించి నివేదిక రూపొందించింది. ఈ నివేదికలో రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం 9.46 మీటర్ల లోతులో నమోదైంది. పెద్దతో పోల్చితే రాష్ట్ర సగటులో మార్పు కనిపించకపోయినా జిల్లాల వారిగా చూస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాగా, రాష్ట్రంలో సాధారణం కంటే 36 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వర్షాకాలంలో సాధారణంగా 883 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సి ఉండగా 1,198 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 33లో 27 జిల్లాలు అధిక వర్షాలు నమోదు చేయడంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల బోర్లు, బావుల్లో నీటి లభ్యత మెరుగుపడింది. ప్రస్తుత రాష్ట్ర భూగర్భ జల శాఖ తాజా నివేదికలు, వాతావరణ శాఖ అంచనాలు రాష్ట్రానికి హెచ్చరిక గంటలు మోగిస్తున్నాయి.
17 జిల్లాల్లో తగ్గిన జలమట్టాలు
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 17లో భూగర్భ జలాలు గత ఏడాది జిల్లాతో ఈ ఏడాది క్షీణించాయి. హైదరాబాద్లో అత్యధికంగా 2.47 మీటర్ల మేర జలమట్టం పడిపోయింది. రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా అంచనా తగ్గుదల నమోదైంది. హైదరాబాద్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. నగరంలో భూగర్భ జలాల వినియోగం తగ్గడంతో వానాకాలం కూడా కనీస అవసరాలకు అనేక ప్రాంతాలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నాయి. ఈసారి మాన్సూన్ కాలంలో కూడా నీటి ట్యాంకర్ల డిమాండ్ వేసవికాలం కంటే ఎక్కువగా నమోదవడం పరిస్థితి తీవ్రతను అంచనా వేస్తోంది.
వ్యవసాయ రంగంపై ప్రభావం
రాష్ట్రంలోని వర్షాధార వ్యవసాయం ఎల్నినో ప్రభావంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే 27 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్ సాగుపై ప్రభావం చూపుతున్నాయి. నల్గొండ, కరీంనగర్, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో రైతులు విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. కొన్ని ప్రాంతాల సాగు విస్తీర్ణం సాధారణ స్థాయిలో కూడా చేరలేదని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. భూగర్భ జలాలు మరింత క్షీణిస్తే బోరు ఆధారిత సాగు పంటలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం జూలై మూడో వారంలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితి కొనసాగితే భూగర్భ జలాలపై మరింత ఒత్తిడి పెరిగింది, తాగునీరు-సాగునీటి సంక్షోభం ముదిరే ప్రమాదం ఉంది. గత ఏడాది ఏడాది రాష్ట్ర భూగర్భ జలాల సంపద అందిస్తే, ఈ ఏడాది ఎల్నినో అదే సంపదకు పరీక్ష పెడుతోంది. జూలై, ఆగస్టు నెలల్లో మంచి వర్షాలు కురిస్తేనే భూగర్భ జలాలకు ఊరట లభించే అవకాశం ఉంది. లేకపోతే రైతాంగం నుంచి పట్టణాల వరకు నీటి సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

