వెల్గటూరు: నోరు ఉందని జనసేన అధినేత, ఎపి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హితవు పలికారు. బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్ శాఖ అధికారులతో పుష్కరాల పనులపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. నోరు ఉందని పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగుండదని. పవన్ కళ్యాణ్ సభకు అనుమతిపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం సభ నిర్వహణకు అనుమతి ఇస్తారని మంత్రి తెలియజేశారు.
పవన్ కళ్యాణ్ ను హీరోగా అందరూ అభిమానిస్తారు. తెలంగాణ, ఆంధ్ర ప్రజలు అన్నదమ్ములు లాగా కలిసి ఉంటున్నారని అన్నారు. భారత దేశంలోనే తెలంగాణ ప్రజలకు ఉన్న మంచి మనసు ఎవరికీ ఉండదన్నారు. తెలంగాణ ప్రజలు దయా గుణంతో ఉంటారని వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరో మారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అడ్లూరి జోస్యం చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో పుష్కరాల పనులు ఆలస్యంగా ప్రారంభించడం వల్ల భక్తులు ఇబ్బంది పడ్డారని తెలియజేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఏడాది పాటు ముందుగానే పుష్కరాల పనులను ప్రారంభించి సకల సౌకర్యాల కల్పనకు కృషి చేసినట్లు మంత్రి వివరించారు.

