జనసేన తెలంగాణ: రాజకీయాల్లో ‘నెగెటివ్ పబ్లిసిటీ’ అనేది ఒక నాయకుడికి ఎంతటి మైలేజీని ఇస్తుందో చెప్పడానికి తెలంగాణ రాజకీయాల తాజా ఉదాహరణ. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలో జనసేన పార్టీ తలపెట్టిన ‘తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ’* చుట్టూ జరిగిన పరిణామాలు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్‌ను ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో ‘సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’గా మార్చారు. గతంలో ఓట్లు, సీట్లు సాధించలేకపోయిన పవన్ కల్యాణ్‌కు ఇప్పుడు తెలంగాణలో అన్ని ప్రధాన పార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
గత ఓటములు వేరు – ప్రస్తుత హోదా వేరు
గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినప్పుడు జనసేనకు తెలంగాణలో ఆశించిన ఫలితాలు రాలేదన్నది వాస్తవం. డిపాజిట్లు కూడా రాలేదు . కానీ నాటి పవన్ కల్యాణ్‌కు, నేటి పవన్ కల్యాణ్‌కు రాజకీయంగా ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ఘనవిజయంలో కీలక పాత్ర పోషించారు, ఒక పక్కా పొలిటికల్ విన్నర్ గా, ఏపీ డిప్యూటీ సీఎంగా పవర్ ఫుల్ హోదాలో ఉన్నారు. ఒక రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పక్క రాష్ట్రంలో సభ పెట్టాలనుకున్నప్పుడు పొలిటికల్ వెయిట్ వేరుగా ఉంటుంది. ఈ మార్పును గమనించే ఇక్కడి పార్టీలు ఆయనను సీరియస్‌గా తీసుకోవడం ప్రారంభించాయి.
కవిత అటాక్ – కోల్పోయిన స్పేస్ కోసం ఆరాటం
ల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన వేదికపై పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని ‘పళ్లు రాలగొడతాం’, ‘విగ్రహాలు పార్సిల్ చేస్తాం’ అంటూ చేసిన వ్యాఖ్యల వెనుక స్పష్టమైన వ్యూహం ఉంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటముల తర్వాత బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్‌పై పట్టు కోల్పోయింది. ఇప్పుడు పవన్ కల్యాణ్‌ను ఒక ‘ఆంధ్రా నేత’గా ప్రొజెక్ట్ చేసి, ఆయనపై దాడి చేయడం ద్వారా మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చి బీఆర్ఎస్ ఓటు బ్యాంకును..సానుభూతిపరుల అభిమానాన్ని పొందాలని కవిత ప్లాన్ చేశారు.
కాంగ్రెస్ మంత్రి పొన్నం వ్యూహం – సెంటిమెంట్ చేజారకుండా
కవిత టీఆర్ఎస్ మాత్రమే కాకుండా, అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పవన్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఏడ్చిన వ్యక్తికి ఇక్కడ నవనిర్మాణం గురించి మాట్లాడే హక్కు లేదు, ముందు క్షమాపణ చెప్పాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ మా అయ్య జారీకే అని ప్రకటించారు. కవిత మాత్రమే తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకోకుండా, అధికారంలో ఉన్న వారు కూడా ఇక్కడి ఆత్మగౌరవాన్ని కాపాడగలమని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నించింది. ఈ రెండు ప్రధాన పార్టీలు పవన్‌ను టార్గెట్ చేయడం ఆయన పొలిటికల్ గ్రాఫ్‌ను మరింత పెంచింది.
పవన్‌కు లభించిన విక్టిమ్ కార్డ్
గచ్చిబౌలి సభకు సైబరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడం జనసేనకు రాజకీయంగా పెద్ద అస్త్రంగా మారింది. శాంతిభద్రతల సమస్యలు, ట్రాఫిక్ సాకులు చెప్పి సభను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వం పవన్‌ను ఒక ‘బాధిత నేత’గా మార్చేసింది. పవన్ కల్యాణ్ కూడా ఏమాత్రం తగ్గకుండా మంగళవారం సాయంత్రం తన నివాసంలో ప్రెస్‌మీట్ పెట్టి.. ఇచ్చిన కౌంటర్ నేషనల్ లెవెల్లో హైలైట్ అయింది. ఒక సాధారణ సభ జరిగితే ఆయన తన క్యాడర్‌కు దిశా నిర్దేశం చేసి వెళ్ళిపోయేవారు. కానీ ఈ నిషేధం వల్ల ఆయన తెలంగాణలో ఒక బలమైన ‘ప్రత్యామ్నాయ శక్తి’గా ప్రొజెక్ట్ అయ్యారు.
అత్యుత్సాహమా? వ్యూహాత్మక తప్పిదమా?
ఈ మొత్తం ఎపిసోడ్లో తెలంగాణ నేతలు చేసినది వ్యూహాత్మక తప్పిదం అంటే చెప్పాలి. పవన్ కల్యాణ్‌ను పొలిటికల్ గా తొక్కేయాలంటే అత్యుత్సాహంతో వారు చేసిన కామెంట్లు, తీసుకున్న నిర్ణయాలు చివరికి జనసేనకే మేలు చేశాయి. విమర్శలు ఎంత తీవ్రంగా ఉంటే, రాజకీయాల్లో నాయకుడి వైపు అంతగా ఫోకస్ పెరుగుతుంది. తెలంగాణలో లక్షలాది మంది జనసేన అభిమానులు, సెట్లర్లు మరియు తటస్థ ఓటర్లు ఇప్పుడు పవన్ కల్యాణ్ వైపు మరింత ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా ఈ వివాదం దోహదపడింది. తెలంగాణ పార్టీలు పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా బలహీనపరచాలని చూశాయి, కానీ ఫలితం మాత్రం రివర్స్ అయింది. జనసేనను తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఒక బలమైన శక్తిగా నిలబెట్టడంలో ఇక్కడి నేతల విమర్శలు, పోలీసుల ఆంక్షలే ప్రధాన పాత్ర పోషించాయి.
ఇంకా చదవండి

