‘పల్లకీలోకి వర్మగారొచ్చినా, శర్మగారొచ్చినా.. మోసే వాడికి బరువులో తేడాలేద’ని ఎక్కడో రాస్తారు రాచకొండ విశ్వనాథశాస్త్రి (రావిశాస్త్రి). బలమైన ఆశలు – ఆకాంక్షలతో దశాబ్దాల పోరాటం, దద్దరిల్లిన ఉద్యా మాల తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారమై పుష్కరకాలం ముగిసింది. రాష్ట్రం ‘తెచ్చిన’ వారు మొదట తొమ్మిదిన్నరేళ్లు పాలిస్తే, వారిని కాదని ప్రజా మద్దతుతో అధికారంలోకి వచ్చామంటున్న రాష్ట్రం ‘ఇచ్చిన’వారి ఏలుబడి మొదలై అప్పుడే రెండున్నరేళ్లు! మొత్తంగా పుష్కరకాలం గడిచాక.. తెలంగాణ రాష్ట్ర లక్ష్యసాధన మార్గంలోనే ఉందా? ఉమ్మడి రాష్ట్రంలో ఊపిరాడని స్థితినుంచి సొంత రాష్ట్ర భావన మొగ్గతొడి గి, పూతోటై విరాజిల్లుతున్న తెలంగాణలో సర్వజనుల ఆశలు నెరవేరుతున్నాయా? ప్రత్యేక రాష్ట్రంలో పాత దోపిడీ వ్యవస్థ పోయి ఆశించిన రీతిలో పాలన సాగు తోందా? ఉద్యమాలకు ఊపిరిలూదిన నినాదం ‘నీళ్లు- నిధులు -నియామకాలు’ నిజమై, వాటి ఫలాలు పౌరులకందుతున్నాయా? సబ్బండ వర్ణాల సగటు జీవితాలు బాగుపడ్డాయా? ఇప్పుడివన్నీ జవాబు రావాల్సిన ప్రశ్నలే! ఎందుకంటే, కాలచక్రంలో పన్నెండేళ్లు పరిగణించదగ్గ సముచిత సమయమే! మరి, ఫలాలు సమంజసంగా ఉన్నాయా?
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాలు వైభవంగా, ఉత్సాహంగా సాగాయి. రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లయింది. ఏం సాధించాం? అని బేరీజు వేసుకోవాల్సిన సమయం. దేశ స్వాతంత్య్రానంతర కాలంలో మొదట్నుంచి కొనసాగుతున్న పలు ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణది భిన్న చరిత్ర! దాదాపు ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానం. నిజాం నిరంకుశ పాలననుంచి ఏడాది ఆలస్యంగా స్వాతంత్ర్యం పొంది, ఒకసారి ఇతరులతో కలిసి విశాలాంధ్రగా ఏర్పడి, ఇంకోసారి విడిపోయి ప్రత్యేక రాష్ట్ర హోదా పొందిన ‘తెలంగాణ’ ఇవాళ ఏ విధంగా ఉందా? సగటు మనిషి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా? అని ప్రశ్నించుకోవాలి. ప్రత్యేక రాష్ట్రం ఎందుకు? పోరాడి సాధించుకున్నాక ఈ కోరిక నెరవేరుతోందా? అన్నది అన్నింటికన్నా ప్రాథమిక ప్రశ్న. దీనికి, పాలకులతో పాటు ఉద్యమకారులు, బుద్ధిజీవులు, ఇతర సామాజికవేత్తలు సమాధానం చెప్పాలి. ఆ పరిణామాలను సమీక్షించుకోవాలనే అంశం చర్చకు వస్తోంది. ప్రజా తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ.. ఇలా ఎన్నెన్నో భావనలు పరివ్యాప్తమైన మీదట కూడా భౌగోళిక తెలంగాణయే తప్ప సామాజిక తెలంగాణ ఇంకా ఏర్పడితే లేదన్న అసంతృప్తి కలుగుతోంది. సమ్మిళిత వృద్ధి జరుగకపోవడమే అందుకు కారణం.
పలు మార్పులతో ‘అభివృద్ధి సాధించామ’ని ప్రభుత్వాలు చెబుతాయి. అంకెలెప్పుడూ అర్థ సత్యాలేనని విమర్శకులంటారు. ‘అభివృద్ధి’ అనేది ఒకే అర్థంలో కనబడని బ్రహ్మ పదార్థం. ఎవరి అభివృద్ధి..? అనే ప్రశ్న జనిస్తుంది. కొత్తగా ఏర్పడ్డ చిన్న రాష్ట్రం అయినా అనేక విషయాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నెలబెట్టామని కిందటి ప్రభుత్వ పెద్దలు చెప్పేవారు. రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) విజయం సాధించి ప్రభుత్వం ఏర్పరచడం, 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో మళ్లీ గెలిచి మొత్తంగా తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉండటం అందరికీ తెలిసిందే! సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని వారు చెప్పేది. ప్రత్యర్థి పక్షాలు మాత్రం పదేళ్ల పాలనలో ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని, రూ. 8 లక్షల కోట్ల రుణాలతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, రాష్ట్ర సాధన ఉద్యమకారులను నిర్లక్ష్యం చేశారని, ఉద్యోగ, ఉపాధి కల్పించకుండా యువతను తీవ్ర అసంతృప్తికి గురిచేశారని విమర్శించారు. 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అవి అలాగే ఉన్నాయని ప్రస్తుత విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎన్నికల ముందు ప్రజలను నమ్మించి చెప్పిన ‘ఆరు గ్యారెంటీల అమలు’ కూడా అంతంతే అని ప్రత్యర్థి బిఆర్ఎస్, బిజెపిలు విమర్శిస్తున్నాయి. పరస్పర విమర్శల పర్వం సాగుతోంది.
నిధులకు కటకట
ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను కలుపుకొని ఏర్పడ్డ తెలంగాణ ఆరంభంలో ఆర్థికంగా మిగులు రాష్ట్రం. కానీ, ఇప్పుడు రోజు గడపడం కష్టం! రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క జిల్లాల వారిగా ప్రజాప్రతినిధుల భేటీలో చెబుతున్న దాన్నిబట్టి పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది. సగటున ప్రతినెలా 17, 18 వేల కోట్ల రూపాయల రాబడి ఉంటే నెలవారీ ఖర్చు 19 నుండి 20 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. సగటున నెల్నెల రూ. 2,200 కోట్ల లోటు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంతకు ముందు స్వయంగా వెల్లడించినట్లు మూడో వంతు రాబడిల కిస్తీలు, వడ్డీలకు వెళుతుంటే మరో వంతు రాబడిని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారు. ఇక అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేపట్టాలి..? ఏవి నిధులు..? అనే ప్రశ్న సహజమే. ఈ పరిస్థితుల్లో 2026 -27 బడ్జ్జెట్ రూ. 3.25 లక్షల కోట్లతో సభ ఆమోదం పొందడం వల్ల ప్రయోజనం ఏమిటి..? కేంద్రని బిజెపి నేతృత్వపు ఎన్‌డిఎ ప్రభుత్వం పూర్తి సహాయ నిరాకరణ చేస్తోందని, రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన వాటా కూడా ఇవ్వటం లేదని పాలకపక్షం విమర్శిస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన వివిధ ప్రాజెక్టులు, కార్యక్రమాలకు నిధులు తెచ్చుకోవడంలో రాష్ట్ర అధికార యంత్రాంగం సమర్థంగా, చొరవతో పనిచేయడం లేదనే విమర్శ కూడా ఉంది. ప్రభుత్వ భూములను తెగనమ్మి పన్నేతర ఆదాయాలను ప్రభుత్వం సమకూర్చుకుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకుల వల్లే నిధుల్లో అన్యాయం అనినా సొంత రాష్ట్రంలోనూ ఈ దుస్థితి ఎందుకన్నది ప్రశ్న!
నీళ్లతో నిత్య జగడాలే!
ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో ఎత్తిపోతల రికార్డు సృష్టించి కాళేశ్వరంతో తెలంగాణ జీవనరేఖ దిద్దామని గత ప్రభుత్వం చెప్పుకుంది. అదొక పెద్ద అవినీతి ప్రాజెక్టు అని, లక్ష కోట్ల రూపాయిలు దుబారా చేసి మునిగిపోయిన ప్రాజెక్టుతో వేల కోట్లు దండుకున్నారని కాంగ్రెస్ అభియోగాలు మోపింది. అధికారంలోకి రాగానే శ్వేత పత్రాల వెల్లడితోపాటు విచారణ జరిపించింది. అందులో అంతిమంగా తేలిందేమీ లేదు. ప్రాజెక్టుకు రిపేర్లు లేవు. సాగు ఆయకట్టు పెరిగిందేమీ లేదు. గోదావరి, కృష్ణా నది జలాల విషయంలో ఎపి, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర జలవివాదాలు పరిష్కారం లేక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే చందంగా తయారైంది. ఎపి తలపెట్టిన బనకచర్ల రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు రేపింది. మధ్యలో ‘పెన్నా’ను ఉంచి కృష్ణా- కావేరి నదుల అనుసంధానం, కేంద్రం ఎన్‌డిఎ ప్రభుత్వం తనకు సహకరిస్తున్నట్లు ఎపి సిఎం చంద్రబాబు చెబుతున్నారు. కొత్త ట్రిబ్యునల్ ఏర్పడి కృష్ణా జిల్లాల్లో వాటాల పునఃపంపిణీ జరగాలని, 66:34 నిష్పత్తి తమకు ఆమోదయోగ్యం కాదని తెలంగాణ వాదిస్తోంది. 70:30 లేదా కనీసం 50:50 నిష్పత్తిలో వాటాల పంపిణీ జరగాలన్నది తెలంగాణ డిమాండ్. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ పదవీ కాలాన్ని 2027 జులై మాసాంతం వరకు పొడిగించారు. కృష్టాల్లో రెండు రాష్ట్రాల డిమాండ్ అధికం కాగా నీటి లభ్యత పరిమితంగా ఉంది. గోదావరిలో నీటి లభ్యత అధికంగా ఉన్నా ప్రాజెక్టులు సవ్యంగా లేవు. పర్యావరణవేత్తలు కోరుతున్నట్టు అధికారాలు, స్వయం ప్రతిపత్తి కలిగిన రివర్ వ్యాలీ అథారిటీలు ఏర్పాటు కానంతవరకు జలజగలు తప్పవేమో?
నియామకాలు అంతంతే!
మూడో ముఖ్య నినాదమైన ఉద్యోగ నియామకాలు, ఉపాధి కల్పనలోనూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన ప్రగతి అంతంత మాత్రమే! అందుకే యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రత్యక్షంగా లక్షన్నర ఉద్యోగాలు కల్పించి, మరెంతో మందికి అవుట్ సోర్సింగ్‌లో, ప్రయివేటులో ఉద్యోగ-, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని గత ప్రభుత్వం చెప్పింది. తమను విమర్శించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన నోటిఫికేషన్లు, నియామక ప్రక్రియ ముగింపు దశలో ఉన్న వాటికి సంబంధించి ఆర్భాటంగా నియామక పత్రాలు ఇవ్వడం తప్ప ప్రత్యేకంగా చేసిందేమీ లేదని బిఆర్ఎస్ విమర్శిస్తోంది. జాబ్ క్యాలెండర్ అన్నారు. అదీ లేదు, కొత్త నోటిఫికేషన్లు లేవు. నిరుద్యోగ భృతి అన్నారు. అతిగతీ లేదన్నది వారి ఆరోపణ. అసలు రాష్ట్రంలో ఎందరు మొత్తం ఉద్యోగులు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరు అనే వాటిపై సరైన డేటా లేదు. కొన్ని చోట్ల ఒకే పని చేస్తున్న ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఖజానాకు రెండు జీతాల భారం మోపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధ్యయనం సరిగ్గా జరగటం లేదు. ఉద్యోగుల జీతభత్యాలు-, ఆఫీసుల నిర్వహణకు ఇప్పటికే ప్రతి నెలా రూ. ఆరు వేల కోట్ల ఖర్చవుతోందని, ప్రస్తుత హడావుడి ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియ ముగిసి, నియామకాలు జరిగితే ఖర్చు రూ. పది వేల కోట్లకు చేరడానికి ఒక అంచనా!
విభజన హామీల అమలు దిక్కు-మొక్కూ లేదు. రూ. 1.42 లక్షల కోట్ల విలువ చేసే (9, 10 షెడ్యూల్ కింద) 142 పబ్లిక్ సంస్థల విభజన జరుగనే లేదు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పలుమార్లు పురమాయించినా రెండు ప్రభుత్వాలు చొరవ చూపక వాటి విభజన, ఆస్తుల పంపకం జరుపుకోలేదు. ఫలితంగా తగు నిఘా, నిర్వహణ, నియంత్రణ, సమీక్షలు లేక ఫలితాలు రావట్లేదు. రావాల్సిన విద్యుత్ బకాయిలు ఇంకా ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించలేదు.
తెలంగాణ ఏర్పాటై పుష్కర కాలం దాటినా ప్రత్యేక రాష్ట్రం కోరుకున్న సబ్బండ వర్గాల ఆకాంక్షలు తీరనేలేదు. తెలంగాణ కవి, వైతాళికుడు కాళోజీ నారాయణరావు అన్న మాటలు గుర్తొస్తున్నాయి. ‘నా పాత రచన ఇవాళ్టికీ సరిపోతోందని ఆనందించనా..? ఇంకా పరిస్థితులు అలానే ఉన్నాయని విచారించానా..?
దిలీప్‌రెడ్డి
(రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ)

