– ప్రకటన –
– మృతదేహం కోసం బాధిత కుటుంబం ఎదురుచూపులు
నవతెలంగాణ – నిజామాబాద్ డెస్క్ : నిజామాబాద్ గాజులపేటకు చెందిన యువకుడు నీల సాయికుమార్ గుప్త (30) పూరి జగన్నాథ్ లోని గుండం లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. రెండు రోజుల క్రితం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడి తల్లిదండ్రులు వృద్ధులు కాగా వారికి వెనుక ముందు ఎవరూ లేకపోవడంతో పుట్టడు శోకంలో మృతదేహం కోసం సిద్ధమయ్యారు. వివరాల్లోకి వెళితే.. గాజులపేట కు చెందిన నీల సాయికుమార్ గుప్త (30) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నిరుపేద కుటుంబం కావడంతో పని చేస్తేనే పూట గడిచే పరిస్థితి. వృద్ధ తల్లిదండ్రులు సాయికుమార్ మీదే జీవనం సాగిస్తున్నారు.
కాగా ఓ ట్రావెల్స్ సంస్థ వారు దేవాలయాల సందర్శనార్థం టూరిస్ట్ బస్సు తీయగా ఇతర కాలనీవాసులతోపాటు సాయికుమార్ కూడా వెళ్ళాడు. వివిధ ఆలయాల దర్శనాలు చేసుకుంటూ పూరి జగన్నాథ్ కు చేరుకున్నారు. అక్కడ దైవ దర్శనానికి ముందు స్నానం చేసేందుకు గుండంలో దిగగా ప్రమాదవశాత్తు నీటిమునిగి మృతి చెందాడు. ఈ ఘటన రెండు రోజుల క్రితం చోటు చేసుకోగా ఆ ట్రావెల్స్ సంస్థ నిర్వాహకులు ఇప్పటికీ అక్కడకు రాలేకపోయారు. డ్రైవర్ స్థానికుల ద్వారా సమాచారం ఇవ్వడంతో వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఘటన చోటు చేసుకున్న ఇప్పటికీ మృతదేహం ఇంటికి చేరలేదని దీనంగా ఎదురు చూస్తున్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా స్పందించి తమ కొడుకు మృతదేహాన్ని తెప్పించేందుకు చొరవచూపి తమను ఆదుకోవాలని యువకుడి తల్లిదండ్రులు కోరుతున్నారు.
– ప్రకటన –

