- తూచ్.. హార్ముజ్‌పై ఎలాంటి ఒప్పందం జరగలేదు
- ఇరాన్ మీడియాది తప్పుడు కథనాలు
- తీవ్రంగా ఖండించిన వైట్‌హౌస్
హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికా-ఇరాన్ మధ్య ముసాయిదా ఒప్పందం కుదిరిందంటూ ఇరాన్ మీడియా ఊదరగొట్టింది. హార్ముజ్ దగ్గర అమెరికా దిగ్బంధాన్ని ఎత్తివేస్తోందని.. అలాగే ఇరాన్ కూడా హార్ముజ్‌ను తెరుస్తోందని ప్రచారం చేసింది. అయితే ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రచారం చేసిన వార్తలను వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసిన అవగాహన ఒప్పందం (MoU) ముసాయిదా పూర్తిగా కల్పితమని అమెరికా స్పష్టం చేసింది.
ఇరాన్ ప్రభుత్వ టీవీ కథనం ప్రకారం.. అమెరికా-ఇరాన్ మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరిందని, దాని ప్రకారం హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలు నెల రోజుల్లో పురోగమించాయని. అలాగే ఇరాన్‌పై అమెరికా విధించిన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైనిక ఉనికిని తగ్గించడం వంటి అంశాలు ముసాయిదాలో ఉన్నాయని ప్రచారం చేసింది.
అయితే ఈ వార్తలను అమెరికా వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది. “ఇరాన్ ప్రభుత్వ విడుదల చేసిన ఈ కథనం పూర్తిగా అబద్ధం. వారు విడుదల చేసినట్లు చెబుతున్న ఎంవోయూ కూడా నకిలీది. ఇరాన్ మీడియా ప్రచారాన్ని ఎవరూ నమ్మకూడదు. వాస్తవాలకే మీడియా ప్రాధాన్యత ఉంది” అంటూ వైట్‌హౌస్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
ఇక హార్ముజ్ ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన జలమార్గంగా ఉంది. ప్రపంచ క్రూడ్ ఆయిల్, ఎల్ఎన్జీ రవాణాలో పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ప్రతిసారి అంతర్జాతీయ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఫిబ్రవరి 28 నుంచి అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో పశ్చిమాసియాలో నౌకా రవాణా, చమురు సరఫరా, ప్రాంతీయ భద్రతపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఏప్రిల్ 8 నుంచి కాల్పుల విరమణ అమల్లో ఉంటుంది.. పరస్పరం ఒప్పంద ఉల్లంఘన ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. ఇరాన్ మీడియా ఒప్పంద వార్తలతో అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. హార్ముజ్ జలసంధిలో రవాణా సాధారణ స్థితికి వస్తుందనే అంచనాలతో ట్రేడర్లు స్పందించినట్లు అంతర్జాతీయ మీడియా గుర్తించింది. అయితే వైట్‌హౌస్ తాజా ఖండంతో అమెరికా-ఇరాన్ మధ్య తుది ఒప్పందం ఇంకా దూరంలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

