వచ్చే వారం విడుదల కాబోతున్న పెద్దికి మదరాస్ హైకోర్టు యాంటీ పైరసీ ఇంజక్షన్ రక్షణ కల్పించింది. అంటే ఎవరైనా ఈ సినిమాని పైరసీ చేసి వెబ్ సైట్స్ లో పెట్టినా, ఎక్కడైనా యాప్స్ లేదా ఆన్ లైన్ ద్వారా రవాణా చేసిన వెంటనే కట్టడి చేసే స్వతంత్ర నిర్మాణ సంస్థకు ఉంటుంది. అంటే ఉదాహరణకు ఫలానా ఏబిసి సైట్ లో ఎవరో పెద్ది అప్లోడ్ చేశారనుకుందాం. న్యాయస్థానం లేకుండా ఇంటర్ ప్రకారం ఎలాంటి అనుమతులు అవసరం నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వాటిని తక్షణం తొలగించాలి.
ఇది నిజంగా ఫలితం ఇస్తే ప్రపంచాన్ని జయించినట్టే. ఎందుకంటే ఎన్ని చర్యలు తీసుకున్నా దశాబ్దాలుగా ఇండస్ట్రీని పైరసీ భూతం వదల్లేదు. ఆ మధ్య తమిళనాడు సీఎం విజయ్ జన నాయకన్ హఠాత్తుగా హెచ్ డీలో లీకై కోలీవుడ్ ని కుదిపేసింది. నిర్మాణ సంస్థ సకాలంలో స్పందించి అన్నీ తీయించేసినా ఇప్పటికే లక్షల్లో జనాలు చూసారు. అంతకు ముందు తాండేల్, హిట్ 3, గేమ్ ఛేంజర్ లాంటి ఎన్నో కొత్త సినిమాలు ఈ రాకాసి బారిన కోట్ల రూపాయల నష్టం చవి చూశాయి.
ఇప్పుడు పెద్ది వంతు వచ్చింది. నిర్మాత ఈ సవాల్ ని ఎలా ఎదురుకుంటారో చూడాలి. ఒకవేళ సక్సెస్ అయితే ఇతర ప్రొడ్యూసర్లకు కూడా దారి దొరికినట్టు అవుతుంది. ఎందుకంటే జూన్ నుంచి వరసగా మంచి కంటెంట్ ఉన్న పెద్ద సినిమాలు క్యూలో ఉన్నాయి. లెనిన్, ప్యారడైజ్, విశ్వనాథ్ అండ్ సన్స్, జైలర్ 2, విశ్వంభర, స్వయంభు,భోగి లాంటివి భారీ అంచనాలతో థియేటర్లకు వస్తున్నాయి. వీటికి కూడా ఇంజక్షన్ ఆర్డర్స్ లాంటివి చాలా అవసరం.
రవి అరెస్ట్ కాగానే ఐబొమ్మ అంతరించిపోయిదనుకున్న టైంలో ఇటీవలే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం పోలీసులను సైతం షాక్ కు గురి చేసింది. బెయిల్ మీద బయటికి వచ్చిన రవి తనకు సంబంధం లేదని చెబుతున్నా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. పెద్ది మీద వందల కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది. రికవరీ జరగాలంటే అద్భుతమైన టాక్ తో పాటు పైరసీ ని అణిచివేయాలి. ఇందులో ఎంతవరకు సఫలీకృతమవుతారో ఇంకొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.

