భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా అపురూపమైనది. భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమగా ఉంటూ, ఒకరితో ఒకరు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఆ బంధం బాగుపడుతుంది. అయితే ఈ బంధంలో చాలామంది భర్తలు తమ భార్యకు ఎంతో ప్రేమను పంచుతున్నామని, ఎంతో బాగా చూసుకుంటున్నామని చెప్పారు. కానీ ఇది చాలా తప్పు. కేవలం ప్రేమతో మనిషి సంతోషంగా ఉండటం అనేది జరగదు. గిఫ్ట్ లు, గోల్డ్, చీరలు.. ఇవన్నీ కొనిపెట్టడం మీద మహిళల సంతోషం ఉండదు. చాలామంది పెద్ద గొడవలు ఏమీ జరగడం లేదు కాబట్టి ఆ బంధంలో ఉన్నవారు సంతోషంగా ఉంటారని అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. కొన్ని చిన్న చిన్న అలవాట్లు, కొన్ని చిన్న చిన్న విషయాలు బంధాన్ని బహిష్కరిస్తాయి. మహిళలు ఎవరికీ చెప్పుకోలేక తమలో తాము ఎక్కువగా బాధపడే కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
ఇతర మహిళల పై ఎక్కువ శ్రద్ధ చూపడం..
మగాడు తన భాగస్వామితో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇతర స్త్రీల వైపు చూడటం లేదా వారిపై ఎక్కువ శ్రద్ధ చూపించడం చేస్తే. ఆతనితో బంధంలో ఉన్న స్త్రీ అభద్రతా భావానికి లోనై, నిర్లక్ష్యానికి గురైనట్లు కనిపించవచ్చు. ఇతర స్త్రీల వైపు చూస్తే మగాడు తన భార్యను అవమానించినట్టు. కేవలం అవమానం మాత్రమే కాదు.. ఆమె గౌరవాన్ని కూడా దెబ్బతీసినట్టే. అసలు జీవితంలో ఆమెకు ప్రాధాన్యత ఇవ్వనట్టు.
ప్రత్యేక సందర్బాలు మరచిపోవడం..
చాలామంది మగాళ్లకు పెళ్లిరోజు తేదీలు కూడా గుర్తుండవు అని తరచుగా అంటుంటారు. ఇది బయటకు సరదాగా, సరదాగా మాట్లాడే విషయం అయినా.. మహిళలకు ఇవి ఎంతగానో బాధపెడతాయి. మొదటిసారి కలుసుకున్న రోజు, భాగస్వామి పుట్టినరోజు, మ్యారేజ్ డే వంటి ముఖ్యమైన తేదీలు, సందర్భాలు గుర్తుంచుకోకపోతే మహిళలు చాలా బాధపడతారు.
ఎక్కువగా ఆలోచించకూడదని చెప్పడం..
మహిళలు ఆందోళనలను లేదా తన భర్తతో పంచుకున్నప్పుడు, దానికి చెప్పకపోయినా కనీసం అర్థం చేసుకుంటే చాలు, ఎంతో ఊరటగా ఫీల్ అవుతుంది. కానీ మహిళలు తమ భయాలు, ఆందోళనలు షేర్ చేసుకున్నప్పుడు , అంతగా ఆలోచించకు అని చెప్పడం వల్ల ఆమె తన మాటలను పట్టించుకోవడం లేదని ఫీలవుతుంది.
భార్య కంటే స్నేహితులు, బయటివారి మాటకే విలువ ఇవ్వడం..
ప్రతి మగాడి జీవితంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు ముఖ్యమైన పాత్ర పోషించారు. కానీ ప్రతి మగాడు తన నిర్ణయాలలో ఎల్లప్పుడూ స్నేహితుల అభిప్రాయాలకే ప్రాధాన్యతనిస్తూ, భార్య చెప్పే విషయాలు, భార్య ఫీలింగ్స్ ను విస్మరిస్తే అది ఆ సంబంధంలో దూరాన్ని సృష్టిస్తుంది. అంతే కాదు.. బయటి వాళ్ల మాటలతో భార్యను చిన్నతనంగా మాట్లాడటం, భార్యకు విలువ ఇవ్వకపోవడం కూడా బంధాన్ని బలహీనపరుస్తుంది.
మద్దతు ఇవ్వకపోవడం..
ఎన్నో ఏళ్లు కని పెంచిన తల్లిదండ్రులను వదిలి ప్రతి ఆడపిల్ల భర్త వెంట అత్తింటికి వెళుతుంది. కానీ చాలామంది మహిళలు అత్తింట్లో, భర్త వైపు కుటుంబ సభ్యుల నుండి అవమానం ఎదుర్కొంటూ ఉంటారు. భార్యను ఏదైనా మాటలు అన్నా, భార్యను చిన్నతనంగా చూసినా ఆమెకు మద్దతు ఇచ్చి మాట్లాడాల్సింది పోయి, వాళ్లతో కలిసి భార్యను నిందించారు. ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. మహిళలు చాలా భాధపడతారు.
ఒంటరితనం..
ప్రతి ఒక్కరూ తమ సంబంధాలలో , కుటుంబంలో వారికి విలువ ఉండాలని కోరుకుంటారు. ప్రతి మహిళ తన మాటకు, తన అభిప్రాయానికి, తనకు ప్రాధాన్యత ఉండాలని కోరుకుంటారు. ఆమెకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా కేవలం వివాహ బంధంతో ఇంటికి తెచ్చుకున్న ఒక వ్యక్తిలాగా ఆమెను ట్రీట్ చేస్తే ఆమె మానసికంగా ఒంటరితనాన్ని అనుభవిస్తుంది.
ఇతరులతో పోల్చడం..
చాలామంది మగవారు తమ భార్యలను ఇతరులతో పోల్చుతారు. అమ్మలా వంట చేయలేవు, అక్కలాగా పని చేయలేవు, ఇలాంటివి మాత్రమే కాకుండా.. శారీరకంగా, ఇతర విషయాలలో ఇతరులతో పోల్చి మాట్లాడటం వల్ల మహిళలు చాలా బాధపడతారు. ప్రతి మనిషిని మనిషిగా చూడాలి, వారిలో ప్లస్ పాయింట్స్ ను ఎలా స్వీకరిస్తారో అలాగే మైనస్ ను స్వీకరించాలి. పోల్చడం వల్ల మహిళల ఆత్మగౌరవం దెబ్బతింటుంది.
*రూపశ్రీ.

