హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని బేగంపేటలో గల ది ప్లాజా వేదికగా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(టీజీటీడీసీ), తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ సహకారంతో శనివారం మామిడికాయ పచ్చడి వర్క్‌షాప్ జరిగింది. ఈ టూరిజం డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, ఎండీ గౌతమి, డైరెక్టర్ రంజిత్ నాయక్ ఉన్నారు. మన ఊరి రుచిని, సంప్రదాయ శిక్షణను నేటితరానికి అందించాలనే లక్ష్యంతో ఈ వర్క్‌షాప్‌కు గృహిణులు, ఆహార ప్రియుల నుంచి స్పందన లభించింది. ప్రముఖ చెఫ్, వాహ్ చెఫ్ సంజయ్ తుమ్మా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
పక్కా తెలంగాణ స్టైల్లో ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేయాలో ఆయన చేసి చూపించారు. ఏ రకమైన మామిడికాయలు వాడాలి? మసాలాల నిష్పత్తి ఎలా ఉండాలి? ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. తెలంగాణ చెఫ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమేయ్ మరాఠే బృందం పచ్చడి తయారీలో సూచనలు చేసింది. స్వస్తిక్ స్పైసెస్, త్రీ మ్యాంగోస్ సంస్థలు నాణ్యమైన ముడి సరుకులను అందించాయి. తెలంగాణ సంప్రదాయ ఆహార సంస్కృతిని కాపాడుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని టూరిజం అధికారులు తెలిపారు.

